Fake Doctors: ఇలలో దైవానికి ప్రతిరూపంగా భావించే వైద్యుల్లో కొందరు నకిలీలుగా బయటపడటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వీరు గత కొన్నేళ్ల క్రితమే నకిలీ ధ్రువపత్రాలతో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) నుంచి గుర్తింపు సంఖ్యను పొందటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల టీఎస్‌ఎంసీ జరిపిన పరిశీలనలో నకిలీ ధ్రువపత్రాలతో నలుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వెల్లడైంది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా కథను మించిన ఈ పరిస్థితి టీఎస్‌ఎంసీ నిర్లక్ష్య కార్యకలాపాలను బహిర్గతం చేసింది.
వెలుగులోకి ఎలా?
సాధారణంగా టీఎస్‌ఎంసీలో తమ సమాచారాన్ని నమోదు చేసుకున్న తర్వాతే పట్టభద్రులు వైద్యవృత్తిని చేపట్టాలి. ఇలా ఐదేళ్లకోసారి వారు తమ సమాచారాన్ని తిరిగి నమోదు చేసుకోవాలి. ఈ క్రమంలో చైనాలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించినట్లుగా ఓ వైద్యుడు ఐదేళ్ల కిందట తొలిసారి తన సమాచారాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత పునఃనమోదుకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. వివరాలన్నీ సరిగ్గానే ఉన్నా.. ఫొటో మారిపోయింది. దీంతో పాత ధ్రువపత్రాన్ని పరిశీలించగా నకిలీ సమాచారాన్ని సమర్పించినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో ఫోన్ నంబరు ఆధారంగా సంబంధిత వ్యక్తికి కాల్ చేశారు. తాను చైనాలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణుడైన విషయం వాస్తవమే అయినా.. తానిప్పటి వరకూ టీఎస్‌ఎంసీలో సమాచారాన్ని నమోదు చేసుకోలేదని ఆ వ్యక్తి చెప్పడంతో అధికారులకు విషయం అర్థమైంది. ఆ వ్యక్తి ధ్రువపత్రాన్ని అడ్డం పెట్టుకొని మరో వ్యక్తి తొలిసారి సమాచారాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా.. రెండోసారి ఇంకో వ్యక్తి ఫొటోను పెట్టి.. మరో తప్పుడు ధ్రువపత్రం పొందడానికి యత్నించాడని నిర్ధారించారు. ఈ క్రమంలో మరికొన్ని పునఃనమోదు దరఖాస్తులను నిశితంగా పరిశీలించగా మరో మూడింటిలోనూ ఈ తరహా అక్రమాలు చోటుచేసుకున్నాయనేది వెలుగులోకి వచ్చింది. వీటిలో...
- ఒక దాంట్లో రిజిస్ట్రేషన్ నంబరును అలాగే ఉంచి.. మిగిలిన పేరు, ఇతర సమాచారాన్ని మొత్తం మార్చేశారు.
- మరో దరఖాస్తులో పేరు గతంలో మాదిరిగానే ఉంచి, ఇతర సమాచారాన్ని కొత్తగా చేర్చారు.
- ఇంకో దాంట్లో రిజిస్ట్రేషన్ నంబరు పాతదే ఉంచి.. కొత్తగా పేరు మాత్రం మార్చారు.
సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదు