రాచకొండ పోలీసులకు చిక్కిన నకిలీ వైద్యుడి కేసులో... నిందితుడితో పాటు మరికొంతమంది నకిలీ పత్రాలతో వైద్యులుగా చెలామణి అవుతున్నట్టు తేల్చారు. దిల్లీకి చెందిన సమృద్ధి కన్సల్టెన్సీ నిర్వాహకుడు సునీల్‌కుమార్ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రదారిగా వెల్లడైంది. విచారణలో సునీల్ అనేక విస్తుపోయే అంశాలు వెల్లడించాడు. రెండు రోజులు సమయం ఇస్తే చాలు... ఎటువంటి ధ్రువీకరణ పత్రం తయారు చేస్తానని విచారణలో సునీల్‌కుమార్ చెప్పాడు. ఎవరినీ నేరుగా కలవడు. అంతా వాట్సప్‌లోనే నడిపిస్తాడు. దాన్ని క్లిక్ చేయగానే సర్టిఫికెట్ కనిపిస్తుంది. రాచకొండ పోలీసులకు పట్టుబడ్డ తేజ కూడా ఇదే తరహాలో ఆరు లక్షల రూపాయలు చెల్లించి ఛత్తీస్‌ఘడ్ రాయపూర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హెల్త్ సైన్సెస్ అండ్ ఆయూష్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు నకిలీ పట్టా పొందాడు.
బయట పడుతున్న నకిలీ వైద్యుడి లీలలు!
పోలీసులనే బురిడీ కొట్టించిన నకిలీ వైద్యుడి వ్యవహారంలో తవ్వే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. వైఎస్ తేజలాగే నగరంలో మరికొందరు నకిలీ వైద్యులున్నారని రాచకొండ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఒక్కొక్కరి వద్ద నుంచి అయిదు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు వరకు తీసుకొని నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నకిలీ ఎంబీబీఎస్ పత్రాలు తయారు చేయడంలో సిద్దహస్తుడైన దిల్లీకి చెందిన సమృద్ధి కన్సల్టెన్సీ నిర్వాహకుడు సునీల్‌కుమార్ విచారణలో ఈ విషయాన్ని ఒప్పుకొన్నాడు. నకిలీ వైద్యుల చిట్టాను బయటకు తీసేందుకు రాచకొండ ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
నకిలీ ఎంబీబీఎస్ పట్టా తయారుచేసి ఇచ్చిన సమృద్ధి కన్సెల్టెన్సీ నిర్వాహకుడి అసలు పేరు కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడని విచారణలో తేలింది. పట్టా ఎక్కడి నుంచి వచ్చిందంటూ పోలీసులు తేజను ప్రశ్నించినప్పుడు రణ్‌వీర్‌సింగ్ ఇప్పించాడని చెప్పాడు. పోలీసులు ఆరా తీస్తే ఆ పేరు ఉన్న వారి జాడ కనిపించలేదు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రధాన సూత్రదారి సునీల్ ఒక్కొక్కరికి ఒక్కో పేరు చెప్పేవాడని గుర్తించారు. దేశవ్యాప్తంగా చాలామందికి నకిలీ ఎంబీబీఎస్ పట్టాలను తయారు చేసిచ్చినట్టు సునీల్ కుమార్ ఒప్పుకున్నాడు. దిల్లీ నుంచి సునీల్‌ను పిటీ వారెంట్‌పై రాచకొండ పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. అయితే తేజ ఎక్కువగా అంతర్జాలంపైనే ఆధారపడి వైద్యం చేసేవాడు. ఎవరైనా ఆరోగ్య సమస్యలు వివరిస్తే... పది నిమిషాలు ఆగండి అంటూ సమయం తీసుకునేవాడు. ఆ సమయంలో గూగుల్‌లో వెతికి ఔషధాలు రాసేవాడు. కరోనా బారిన పడిన రాచకొండ సిబ్బందికి కూడా ఇటువంటి అనుభవమే ఎదురయింది. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన జాగ్రత్తలనే చెప్పేవాడు. రెండేళ్ల కాలంలో నకిలీ డాక్టర్ తేజ నగరంలోని 20 ఆస్పత్రులు మారినట్టు తేలింది. ఏ ఒక్క చోట ఒకటి రెండు నెలలకు మించి చేయలేదని పోలీసులు గుర్తించారు. నగరంలో ఉన్న నకిలీ వైద్యులను గుర్తించేందుకు పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏం చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి