తెలంగాణ

telangana

ETV Bharat / state

కొంప ముంచుతున్న వాట్సప్‌ వైద్యాలు.. ఆచరిస్తే అంతే అంటున్న వైద్యులు - నకలీ కొవిడ్​ చికిత్సలు

Covid online treatment: వైద్యంపై కనీస అవగాహన లేనివాళ్లు వాట్సప్‌లో ఆకట్టుకునేలా పెడుతున్న పోస్టులు అనర్థాలకు కారణమవుతున్నాయి. ప్రజల్లో కరోనా భయాన్ని మరింత పెంచేలా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో వాట్సప్‌లో అడ్డగోలుగా వచ్చిపడుతున్న వైద్య సలహాలు, సూచనలు చేయితిరిగిన వైద్యులను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. అవన్నీ నిజమని నమ్మి ఆచరించి కొత్త సమస్యలు తెచ్చుకున్న వారెందరో. ఇలాంటి సందేశాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

fake-covid-cures
కొంప ముంచుతున్న వాట్సప్‌ వైద్యాలు

By

Published : Jan 17, 2022, 8:57 AM IST

‘ఆల్కహాల్‌కు కరోనా వైరస్‌ను చంపే గుణముంది. గంటకోసారి నీళ్లు కలిపిన మద్యం తాగితే గొంతులో తిష్ఠ వేసిన వైరస్‌ను వంద శాతం చంపేయొచ్చు. తద్వారా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తీవ్ర అనారోగ్యంపాలు కాకుండా కాపాడుకోవచ్చు...’

Covid online treatment: కరోనా మొదటి, రెండో దశల సమయంలో వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఈ ఆల్కహాల్‌ సూత్రాన్ని చాలామంది ఆచరించారు. ఆనక దానికి బానిసలయ్యారు.

ఆయుర్వేదమూ అనుభవజ్ఞుల ద్వారానే...

  • ‘కుక్కర్లో నీళ్లు పోసి, దాని వాల్వు దగ్గర చిన్న పైపు పెట్టి, అక్కడ నుంచి వచ్చే ఆవిరిని రోజుకు నాలుగుసార్లు పడితే చాలు కరోనా ఖతం..’ అని వాట్సప్‌లలో రావడంతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆచరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నవారున్నారు.
  • మిరియాల కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న ప్రచారం నమ్మి పరిమితికి మించి తీసుకుని గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమైన వారున్నారు.
  • మిరియాల పొడి, తేనె, అల్లం రసం కలిపి తీసుకోవాలన్న సూత్రాన్ని పాటించి మరికొందరు అనర్థం తెచ్చిపెట్టుకున్నారు. ఇటువంటివి కూడా నిపుణుల సూచనలతో, నిర్ణీత పాళ్లలోనే తీసుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

''కరోనా సోకిన వ్యక్తి లక్షణాలు, ఆయనకున్న ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యులు మందులు ఇస్తారు. కానీ.. కొందరు ఒకరికి రాసిన మందుల చీటీని మరొకరు తీసుకొని వాటినే కొని వాడారు. అలా చేయడం ప్రమాదాలకు కారణమవుతుందని.. అజిత్రోమైసిన్‌ వంటి యాంటిబయాటిక్‌ మందులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుందని, హృద్రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.''

31 శాతం మందిది ఇదే దారి..

న్యూయార్క్‌, పుణెలకు చెందిన వైద్యుల బృందం కరోనా సమయంలో దేశంలో ఉప్పెనలా ముంచెత్తిన తప్పుడు సమాచారంపై పరిశోధన చేసింది. దీని ఫలితాలను ‘జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇంటర్నెట్‌ రీసెర్చ్‌’లో ప్రచురించింది. దీని ప్రకారం దేశంలో 31 శాతం మంది కరోనా సమాచారం కోసం వాట్సప్‌పై ఆధారపడ్డట్టు తేలింది. అందులో కనీసం సగం సందేశాలను నిజమో, కాదో నిర్ధారించుకోకుండానే ఇతర గ్రూపుల్లోకి పంపించారు. 13 శాతం మంది అసలు తమకు వచ్చిన సందేశాన్ని నిర్ధారించుకోకుండానే తమ మిత్రులకు ఫార్వర్డ్‌ చేసినట్లు వెల్లడయింది. 27 శాతం మంది ఆయుర్వేద, ఇంటి వైద్యం చిట్కాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్వసించారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డ వారు తమకు వచ్చిన కరోనా సందేశాలను నిజమేనని నమ్మారు. ఇందులో 7 నుంచి 8 శాతం మంది ఇంటి వైద్యానికి ప్రయత్నించారు.

ఈ వైద్యంతో ప్రమాదమే..

సోషల్‌ మీడియాలో పోస్టులకు విశ్వసనీయత, నియంత్రణ ఉండదు. కరోనా మొదటి దశ నుంచి సామాజిక మాధ్యమాల్లో చూసి సొంత వైద్యానికి ప్రయత్నించడం పెరిగింది. వైద్యుల సూచనలు లేకుండా యాంటీ వైరల్‌, యాంటిబయాటిక్స్‌, స్టిరాయిడ్లు వంటివి వాడడం వల్ల ముప్పు పెరుగుతుంది. కొన్ని మందులు గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్నింటికి ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ఉండవు. అయినా సోషల్‌ మీడియాలో చూసి వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. విటమిన్‌ డీ, బీ కాంప్లెక్సు, జింకు విచ్చలవిడిగా వాడితే నష్టం ఎక్కువ. కరోనా లక్షణాలు ఉండి.. ఆక్సిజన్‌ సాధారణ స్థాయిలో ఉంటే ఆయా లక్షణాల ఆధారంగా మందులు వాడితే సరిపోతుంది. ఇతర అనుబంధ సమస్యలున్నవారు.. వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి.

-డాక్టర్‌ ఎంవీ రావు, సీనియర్‌ ఫిజీషియన్‌

కొని తెచ్చుకున్నారు...

  • కరోనా మొదటి, రెండో దశల సమయంలో ముక్కులో నిమ్మరసం వేసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న ప్రచారాన్ని నమ్మి.. పాటించిన చాలామందికి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు వచ్చాయి.
  • ముక్కులో కొబ్బరినూనె వేసుకోవడం ద్వారా కూడా కరోనాను తరిమికొట్టవచ్చనే ప్రచారానిదీ ఇదే తీరు. దీన్ని ఆచరించిన పలువురు న్యుమోనియా బారినపడ్డారు.
  • హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కరోనా నుంచి రక్షణనిస్తాయని వాట్సప్‌లో చూసి విటమిన్‌-డీ మాత్రలు వాడడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారు. పరీక్షల్లో శరీరంలో క్యాల్షియం నిల్వలు భారీగా పెరిగినట్లు గుర్తించారు. పది రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత కోలుకున్నారు. సాధారణంగా ఒక మనిషి రక్తంలో మిల్లీ లీటరుకు 30 నుంచి 50 నానో గ్రాముల విటమన్‌-డీ ఉండొచ్చు. ఇది 100 నానో గ్రాములు దాటితే ప్రమాదం. తక్కువ ఉన్నవారు వారానికి 60 వేల యూనిట్ల చొప్పున 8 నుంచి 12 వారాలు వాడాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ప్రమాదకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
  • వేడి నీళ్లు ఎక్కువగా తాగితే కరోనా రాదంటూ వచ్చిన ఓ సందేశాన్ని మరో వ్యక్తి తూ.చా. తప్పకుండా ఆచరించాడు. రోజుకు 5-6 లీటర్ల వేడి నీళ్లు తాగారు. కొద్ది రోజుల తర్వాత అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అధిక రక్తపోటు బాధితుడైన ఆయన వేడి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల యూరిన్‌ ద్వారా సోడియం ఎక్కువగా పోయిందని... అదే సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల రక్తంలో సోడియం స్థాయి పడిపోయిందని తేలింది. వైద్యులు అత్యవసర వైద్యం అందించి అతని ప్రాణాలు కాపాడారు.
  • ప్రొటీన్‌ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే ప్రచారంతో చాలామంది మోతాదు కంటే ఎక్కువ చికెన్‌, మటన్‌ తిని అజీర్ణ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చారని ఓ వైద్యుడు తెలిపారు. కరోనా సమయంలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెరిగాయన్నారు.
  • సామాజిక మాధ్యమాల్లో చూసి కొందరు కరోనా సోకకుండా ముందస్తుగా యాంటీవైరల్‌ మందులను వాడుతున్నారు. శరీరంలో వైరస్‌ లేకుండా ఇలాంటి మందులను వాడితే బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:కర్ణాటకలో భారీగా కరోనా కేసులు.. మహారాష్ట్రలో తగ్గుముఖం

ABOUT THE AUTHOR

...view details