ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ఉద్దేశించి ప్రవేశపెట్టిందే డయల్ 100. ఏ తరహా ఇబ్బంది ఎదురైనా వెంటనే 100కు కాల్ చేయాలని పోలీస్ శాఖ పలు రకాలుగా ప్రచారం చేస్తోంది. కొంతమంది ఆకతాయిలు అకారణంగా ఫోన్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తున్నారు. కొందరైతే ఏకంగా బాంబులున్నాయంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నిజమని నమ్మి పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి వెళ్లి చూసిన తర్వాత నకిలీ బెదిరింపు ఫోన్లుగా గుర్తిస్తున్నారు.
ముంబయి కార్యాలయంలో బాంబు ఉందంటూ హైదరాబాద్ వాసి ఫేక్ కాల్..మూడు రోజుల క్రితం ముంబయిలోని గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందంటూ డయల్ 100కు ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాంబు నిర్వీర్య దళంతో పాటు జాగిలంతో భవనం మొత్తం గాలించారు. బాంబు ఉన్నట్లు పోలీసులకు ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ఫోన్ చేసినట్లు గుర్తించిన ముంబయి పోలీసులు నగరానికి చేరుకొని సదరు యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
పోలీస్ కంట్రోల్ రూంకు బాంబు ఉందంటూ బెదిరింపు కాల్..మూడు నెలల క్రితం హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూంకు సైతం ఓ బెదిరింపు ఫోన్ వచ్చింది. సంతోష్ నగర్ చౌరస్తాలో బాంబు ఉందంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. సైదాబాద్ సీఐ సుబ్బరామిరెడ్డితో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టి ఏమీ లేదని తేల్చారు. సంతోష్ నగర్ కే చెందిన అక్బర్ ఖాన్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 182, 186, 70(బి) కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా 18రోజుల రిమాండ్ కు న్యాయమూర్తి ఆదేశించారు.
కోపంతో బాంబు పెట్టామంటూ..పాతబస్తీలోని చార్మినార్ లో బాంబు పెట్టామంటూ మూడు నెలల క్రితం డయల్ 100కు ఫోన్ వచ్చింది. ఓ యువతి మానవ బాంబుగా మారి చార్మినార్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు జాగిలంతో పాటు మెటల్ డిటెక్టర్ ను తీసుకెళ్లి అణువణువూ వెతికారు. యువతిపై కోపంతోనే ఆమె ఫోటో పంపించి మానవ బాంబు చిత్రీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసుల స్పందన తెలుసుకోడానికి బాంబు ఉందంటూ ఫేక్ కాల్..కొన్నిరోజుల క్రితంవిశాఖపట్నం నుంచి బయల్దేరిన రెండు రైళ్లలో బాంబు ఉందంటూ డయల్ 100కు కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు కాజీపేటలో ఓ రైలును.. హైదరాబాద్ చర్లపల్లిలో మరో రైలును ఆపి చెక్ చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని ఆ రైళ్లలో బాంబులు లేవని గుర్తించారు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అవుతారో కారోనని మేడ్చల్ జిల్లాలోని గండిమైసమ్మ కాలనీలో నివాసముండే కార్తీక్ అనే వ్యక్తి ఈ నకిలీ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం బయటపడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.