తెలంగాణ

telangana

ETV Bharat / state

బీ అలర్ట్​... కరోనా టీకా పేరుతో నకిలీ యాప్‌లు

కేంద్ర ప్రభుత్వం కొవిన్‌ యాప్‌ను ఇప్పటి వరకూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది తెలియక లబ్ధిదారులు సమాచారం నమోదు చేస్తున్నారు. మరో 3-4 వారాల్లోనే కొవిన్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది.

Fake apps under the name of vaccine
బీ అలర్ట్​... కరోనా టీకా పేరుతో నకిలీ యాప్‌లు

By

Published : Jan 6, 2021, 6:54 AM IST

కొవిడ్‌ టీకా పంపిణీకి గడువు సమీపిస్తుండడంతో.. అర్హులైన లబ్ధిదారులు కొవిన్‌ యాప్‌ కోసం యాప్‌ స్టోర్లలో వెతుకుతూ నకిలీల బారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొవిన్‌ యాప్‌ను ఇప్పటి వరకూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది తెలియని లబ్ధిదారులు నకిలీ యాప్‌లలో తమ సమాచారాన్ని పొందుపర్చుతున్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కొవిన్‌ యాప్‌ అధికారికంగా అందుబాటులోకి రావడానికి 3-4 వారాలు పట్టవచ్చని, అప్పటివరకూ వేచి ఉండాలని వైద్యవర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమీక్షించారు. అత్యధిక లబ్ధిదారులకు టీకాలు అందించే విషయంలో అస్పష్టత నెలకొన్నందున, గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరగనున్న దృశ్యమాధ్యమ సమీక్షలో ప్రధానాంశంగా చర్చించాలని నిర్ణయించారు. టీకాల పంపిణీలో కీలక పాత్ర పోషించేది ‘కొవిన్‌ యాప్‌’. ఇందులో సమాచారాన్ని నమోదు చేసుకుంటేనే.. టీకా పొందడానికి అర్హత లభిస్తుంది. ఇది ఇప్పటి వరకూ వైద్యసిబ్బందికి, పోలీసు, పురపాలక, రెవెన్యూ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంది.

రాష్ట్రంలో సుమారు 75 లక్షల మందికి మొదటి విడతలో టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, అందులో ఈ కేటగిరీలకు చెందిన వారు సుమారు 5 లక్షల మంది మాత్రమే. వీరందరి సమాచారాన్ని ‘కొవిన్‌ వెబ్‌ యాప్‌’లో పొందుపర్చుతున్నారు. తొలివిడత లబ్ధిదారులైన 50 ఏళ్లు పైబడినవారు, 18-50 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారి నమోదుపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల్లో ఈ రెండు కేటగిరీల వారే దాదాపు 93 శాతం మంది ఉన్నారు. ఈ లబ్ధిదారుల సమాచార సేకరణ దిశగా ఇప్పటివరకూ ప్రయత్నాలే మొదలుకాలేదు. స్వీయ నమోదుకూ అవకాశమివ్వలేదు. ఈ పరిస్థితుల్లో వారికి ఎప్పుడు టీకాలు అందుతాయనేసందేహాలు నెలకొన్నాయి.

ప్రభుత్వమే ప్రకటిస్తుంది

నకిలీ యాప్‌ల్లో ఎవరూ సమాచారాన్ని పొందుపర్చవద్దని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు హెచ్చరించారు. కొవిన్‌ యాప్‌ను ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. మరో 3-4 వారాల్లో యాప్‌ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఒక ఆలోచన + కాస్త ఓపిక = సరికొత్త స్థాపన!

ABOUT THE AUTHOR

...view details