మా అమ్మ వయసు డెబ్బయి ఏళ్లు. ఎత్తు ఐదడుగుల రెండు అంగుళాలు. బరువు యాభై కిలోలు. ఈ మధ్యే తను ఐదు కిలోల బరువు తగ్గింది. తనకు మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు లేవు. రెండేళ్ల కిందట రొమ్ము క్యాన్సర్ వచ్చింది. చికిత్సలో భాగంగా రేడియేషన్, కీమో థెరపీలు చేయించుకుంది. తను ఎక్కువగా ఉపవాసాలు చేస్తోంది. ఇలా బరువు తగ్గడం మంచిదేనా? ఈ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - ఓ సోదరి
వృద్ధాప్యంలో కారణం లేకుండా బరువు తగ్గడం మంచిది కాదు. మీ ఉత్తరాన్ని బట్టి చూస్తే మీ అమ్మగారు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం లేదనిపిస్తోంది. చెప్పాలంటే ఆవిడ ఉండాల్సిన దానికంటే తక్కువ బరువున్నారు. సమతుల ఆహారం నిర్ణీత మొత్తంలో క్రమపద్ధతిలో తీసుకోకపోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కండరాల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా మారి ఆస్టియోపొరోసిస్ సమస్యకు దారితీయొచ్చు. మజిల్ మాస్ తగ్గడాన్ని సార్కోపీనియా అంటారు.