YCP Leader Harassment: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు చెప్పగానే.. వైసీపీ ప్రజాప్రతినిధుల ఇసుక మాఫియా గుర్తుకొస్తుంది. ఇప్పుడు వారి దౌర్జన్యాలు ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. వీరి ఆగడాలకు దశాబ్దాలుగా నడుస్తున్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. యాడికి మండలం రాయలచెరువులో దాదాపు 3 దశాబ్దాలుగా స్టీటైట్, డోలమైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి. గనుల నుంచి బలపం రాయి కొని పరిశ్రమకు తరలించడానికి 98 మంది మినరల్ డీలర్లు లైసెన్సులు పొందారు. వీరిలో 44 మందికి పరిశ్రమలు ఉండగా.. మిగిలిన లైసెన్సుదారులు కేవలం గనుల నుంచి కొని.. పరిశ్రమలకు సరఫరా చేసే వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. ఈ పరిశ్రమల్లోని 13 రైల్వేట్రాక్‌కు సమీపంలో ఉన్నాయి. వీటిల్లో 8 తెలుగుదేశం సానుభూతిపరులవని తెలుసుకున్న తాడిపత్రికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి.. వేధింపులు ప్రారంభించారు. ఈ 8మందితో పాటు బలపం పౌడర్ ఎగుమతుల వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న.. ఏ పార్టీకీ సంబంధం లేని మరో ఐదుగురు యజమానులను లక్ష్యంగా చేసుకున్నారు.
కట్టుకథ అల్లారు: వైసీపీలో చేరతారా లేదా నెలవారీ మామూళ్లు ఇస్తారా అంటూ బెదిరింపులకు దిగారు. పరిశ్రమల్లో ఏకంగా భాగస్వామ్యం ఇవ్వాలని పెద్ద వ్యాపారులను బెదిరించారు. వీరంతా దారికి రాకపోవడంతో మైనింగ్ అధికారులను రంగంలోకి దింపారు. రైల్వే ట్రాక్ సమీపంలోని పరిశ్రమల నుంచి వచ్చిన దుమ్ము కంట్లో పడిదంటూ చాలా ఏళ్ల క్రితం ఓ రైలు ప్రయాణికుడు ఫిర్యాదు ఇచ్చినట్లు కట్టుకథ అల్లారు. దీన్ని ఆధారంగా చేసుకుని 3 దశాబ్దాలుగా నడుస్తున్న 13 పరిశ్రమలను 8 నెలల క్రితం మూయించేశారు. ఇక్కడ పనిచేసే వేలాది మంది కూలీల పొట్టకొట్టారు.