తాజాగా టీఎస్-బీపాస్ విధానంలో మరికొన్ని వెసులుబాట్లు కల్పించారు. ఇప్పటికే ఉన్న భవనాల్లో అదనపు అంతస్తులు లేదా అదనపు గదుల నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా టీఎస్-బీపాస్ వెబ్‌సైట్‌లో ఏర్పాట్లు చేశారు. భవన నిర్మాణ అనుమతులు రాకుంటే చెల్లించిన మొత్తాన్ని వెనక్కి చెల్లించే ప్రకియనూ ప్రారంభించారు.
అదనపు అంతస్తులు, గదుల నిర్మాణానికీ మార్గం సుగమం
రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు అమల్లో ఉన్న టీఎస్-బీపాస్ విధానంలో మరికొన్ని వెసులుబాట్లు కల్పించారు. గతంలో ఒక వ్యక్తి పేరుతో మాత్రమే భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకునే విధానం ఉండగా.. తాజాగా ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది దరఖాస్తుదారులు ఉన్నా అవకాశం కల్పించారు.
టీఎస్-బీపాస్ ఛార్జీలు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని తిరిగిచెల్లించనున్నారు. దరఖాస్తుదారులకు సహాయపడేందుకు ప్రతి పురపాలక సంఘంలో టీఎస్-బీపాస్ ఫెసిలిటేషన్ (సహాయ) కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తొలుత వీటిని దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నచోట ప్రారంభిస్తారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో లేఅవుట్‌ల అనుమతికీ టీఎస్-బీపాస్‌లో అవకాశం కల్పించారు. గతేడాది నవంబరు 16 నుంచి అమలులోకి వచ్చిన టీఎస్-బీపాస్ కింద ఇప్పటిదాకా 15,700కు పైగా అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో 75 గజాల్లోపు విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌తో తక్షణ అనుమతి పొందినవి 3,600, స్వీయ ధ్రువీకరణ ద్వారా 500 చదరపు మీటర్లు, 10 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు దరఖాస్తు చేసిన వెంటనే అనుమతి పొందినవి 11,800, మిగిలినవి సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అనుమతి పొందినవి ఉన్నాయి.
ఇదీ చూడండి:10 కి.మీ. ప్రయాణం.. రూ. 22,000 కిరాయి..