ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చు. మనుషుల ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో లాక్‌డౌన్ ద్వారా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలిగామని మనల్ని ప్రపంచ దేశాలు, పత్రికలు మెచ్చుకుంటున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం అవసరం. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ఏదో ఒక రాష్ట్ర సీఎం అధ్యక్షతన ముఖ్యమంత్రుల ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి. పీఎం కేర్స్, సీఎంఆర్‌ఎఫ్‌కు కంపెనీలు ఇచ్చే నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద పరిగణించాలి.
ధాన్యం సేకరణకు వడ్డీ లేని రుణాలివ్వాలి..
దేశంలో ప్రజల ఆహార కొరత తీర్చుతున్న రైతులకు ప్రస్తుత సంక్షోభంలో సహాయం చేయాల్సిన అవసరముంది. సత్వర చర్య కింద వ్యవసాయాన్ని ఉపాధిహామీతో అనుసంధానం చేయాలి. వ్యవసాయ కార్యకలాపాలకు అయ్యే ఖర్చులో 50 శాతం రైతులు భరించేలా, మిగతా 50 శాతం ఉపాధి హామీ నుంచి తీసుకునేలా చేయాలి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలి. ఇప్పటికే రబీ పంట పూర్తవుతోంది. లాక్‌డౌన్ సమయంలో ధాన్యం సేకరణ కీలకం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో ధాన్యం సేకరిస్తోంది. ఈ కేంద్రాల సంఖ్యను 6849కు పెంచాలి. పంటల కొనుగోలుకు మా సర్కారు రూ.25 వేల కోట్ల గ్యారంటీ ఇచ్చింది. ఈ కార్యక్రమాలతో ఆరు నెలల పాటు వడ్డీ భారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు వడ్డీ లేని రుణాలు అందించాలి.
రూ.4 వేల కోట్లకు... రూ.100 కోట్లు..
రానున్న రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు భారీగా తగ్గుతుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పన్ను, పన్నేతర ఆదాయాలు తగ్గిపోయాయి. తెలంగాణలో ప్రతి నెలా రూ.4 వేల కోట్ల రాబడి ఉంటే.. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ముందు అప్పు చేయడమే మార్గంగా ఉంది. రాష్ట్రాల ఆదాయాలు తగ్గుతున్నందున ఏడాది కాలానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. రాష్ట్రాలు, ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాల చెల్లింపులను రెండు త్రైమాసికాల పాటు వాయిదా వేయాలి. తాత్కాలిక సర్దుబాటు కోసం ద్రవ్య నిల్వల పరిమితిని 30 శాతం నుంచి నూరు శాతానికి పెంచాలి.