తెలంగాణ

telangana

ETV Bharat / state

అదనపు సమయంతో అధ్యయనానికి మెరుగులు - EXTRA TIME VERY USEFUL TO ALL STUDENTS

జూనియర్‌ ఇంజినీర్ల నియామక పరీక్షను స్టాఫ్‌సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) వాయిదా వేసింది. దీంతో పూర్తిస్థాయిలో సిద్ధమైనవారు కొందరు నిరాశపడ్డారు. కానీ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయానికి మరింత చేరువకావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

STUDENTS PREPARATIONS
అదనపు సమయంతో అధ్యయనానికి మెరుగులు

By

Published : Apr 18, 2020, 1:14 PM IST

సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందిన వారు జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారు.ఎస్‌ఎస్‌సీ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఉద్యోగం పొందేవారు గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల్లో నియమితులవుతారు. అభ్యర్థులు పేపర్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్షనూ, పేపర్‌-2 ఆఫ్‌లైన్‌ రాతపరీక్షనూ రాయాల్సివుంటుంది. పేపర్‌-1లో మెరుగైన మార్కులు సాధిస్తేనే పేపర్‌-2ను రాయటానికి అనుమతిస్తారు.

ఈ దశలో ఏం చేయాలి?

ఇప్పటివరకు వీలైనంత మేరకు అభ్యర్థులు పరీక్షకు సిద్ధమై ఉంటారు. అంతో ఇంతో ఇంకా ప్రిపేర్‌ కావాల్సింది ఉందని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది మంచి అవకాశం. సాధారణంగా పేపర్‌-1లోని జనరల్‌ అవేర్‌నెస్‌పై డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవగాహన తక్కువ ఉంటుంది. ఎంత చదివినా తరగని ఈ విభాగంపై మరింత పట్టు సాధించుకోడానికి ఈ అదనపు సమయాన్ని వినియోగించుకోవచ్ఛు వార్తాపత్రికలూ, ప్రామాణిక పాఠ్యపుస్తకాలను మరోసారి అధ్యయనం చేయవచ్ఛు ప్రశ్నపత్రాలు డిప్లొమా స్థాయిలో ఉంటాయి. కానీ పరీక్షలో డిగ్రీ విద్యార్థులూ పోటీపడతారు. కాబట్టి వాళ్లకు దీటుగా సిద్ధమయ్యేందుకు డిప్లొమా అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్ఛు.

సంపూర్ణ సన్నద్ధతకు అవకాశం

వివిధ కారణాల వల్ల పూర్తిస్థాయిలో సన్నద్ధం కాని అభ్యర్థులకు ఈ పరీక్షల వాయిదా ఒక సువర్ణ అవకాశం. వీరు మొత్తం సిలబస్‌ను సమీక్షించుకోవాలి. ప్రిపరేషన్‌ పూర్తిచేసిన అంశాలనూ, ఇంకా పూర్తి చేయనివాటినీ విడదీయాలి. చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సాధన చేయని అంశాల్లో ముఖ్యమైనవాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ సమయం చాలా కీలకమని గుర్తించాలి. ఎంత శాతం సిలబస్‌ పూర్తయిందీ, ఇంకా చేయాల్సి వుందీ అనేది గమనించి సమయాన్ని తగిన విధంగా కేటాయించుకోవాలి.

రోజుకు 9 గంటల సమయం సన్నద్ధతకు అందుబాటులో ఉంటే, దాన్ని ప్రిపరేషన్‌ పూర్తి చేసిన, చేయని అంశాలకు సరైన నిష్పత్తిలో విభజించుకోవాలి. ఉదాహరణకు 60 శాతం సిలబస్‌ పూర్తిచేస్తే 4 గంటలు పునశ్చరణకూ, 5 గంటలు కొత్త విషయాల సన్నద్ధతకూ వినియోగించుకోవాలి. సబ్జెక్టుకు లేదా సన్నద్ధతకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అధ్యాపకుల/సీనియర్ల సాయంతో నివృత్తి చేసుకోవాలి. నెలవారీ/వారానికి సంబంధించిన ప్రణాళికను తయారు చేసుకోవటం మంచిది. మిగిలిపోయిన పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను ఆ ప్రణాళికలో చేర్చాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా స్వయం ప్రేరితంగా ఉండటం, క్రమం తప్పకుండా ప్రిపరేషన్‌ కొనసాగించటం చాలా ముఖ్యం.

అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. పరీక్షల విజయంలో పునశ్చరణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థి ‘బాగా వచ్చు’ అనుకున్న అంశాలను మళ్లీ చూడకపోతే, మననం చేసుకోకపోతే మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే గతంలో చదివిన వాటిని తప్పనిసరిగా రివిజన్‌ చేయాలి.

  • ఈ పరీక్షకు విషయ స్పష్టత చాలా ముఖ్యం. ఇంతవరకు చేసిన సాధనలో ఏవైనా విషయాలు మిగిలిపోతే వాటిని పూర్తి చేయాలి.
  • ఇంతవరకు సిద్ధమైన అంశాలూ, ఫార్ములాలన్నింటినీ మరిన్నిసార్లు పునశ్చరణ చేయాలి.
  • అభ్యర్థులు తమ సన్నద్ధతలో భాగంగా ముఖ్యాంశాలతో షార్ట్‌ నోట్స్‌ తయారు చేసుకొనివుంటారు. వాటి ఆధారంగా పునశ్చరణ చేయాలి.
  • గత ప్రశ్నపత్రాలూ, మాదిరి ప్రశ్నపత్రాలను ఇంకా సాధన చేయాలి. ఏ అంశాలపై బలహీనంగా ఉన్నారో గ్రహించి మెరుగుపరుచుకోవాలి.
  • ప్రశ్నపత్రాల సాధనలో చేసిన పొరపాట్లను గుర్తించి సంబంధిత అంశాలను రివిజన్‌ చేసుకోవాలి.తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
  • ఇప్పటికే అనేక థియరీ, న్యూమరికల్‌ ప్రశ్నలను సాధన చేసి ఉంటారు. ఆ ప్రాక్టీస్‌ను పరీక్ష వరకు కొనసాగించాలి. ఇందుకు గేట్‌, ఈఎస్‌ఈ వంటి పరీక్షల్లోని ప్రాథమిక ప్రశ్నలను ఉపయోగించుకోవచ్ఛు.- వై.వి. గోపాలకృష్ణమూర్తి●

ఇవీ చూడండి:కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details