TS excise revenue:రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ తర్వాత అధికంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టేది అబ్కారీ శాఖ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అబ్కారీ శాఖకు ఎక్సైజ్‌డ్యూటీ, ఇతరత్రా రాబడులు ద్వారా రూ.17,482 కోట్ల ఆదాయం రాగా.. వ్యాట్‌ద్వారా రూ.13,577 కోట్ల మేర రాబడి వచ్చింది. ఈ రెండు కలిపి మొత్తం రూ.31,059 కోట్ల మేర ప్రభుత్వానికి అబ్కారీ శాఖ ద్వారా రాబడి వచ్చింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో మరో రెండువేల కోట్లు ఆదాయం పెరిగి.. 33వేల కోట్లకుపైగా వచ్చే అవకాశం ఉందని.. అధికారులు అంచనా. ఐతే గురువారం నుంచి బీరు బాటిల్‌పై 10, లిక్కర్‌పై సగటున 20శాతం లెక్కన ధరలు పెరగడంతో ఏడాదికి మరో ఏడువేల కోట్లకుపైగా మొత్తం అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని... అధికారులు అంచనా.. అంటే మద్యం విక్రయాల ద్వారా అబ్కారీ శాఖ నుంచి... దాదాపు 40వేల కోట్ల మేర రాబడి ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏడాదికి 7వేల కోట్లకు పైనే..: పెరిగిన మద్యం ధరలను రోజువారీగా అమ్ముడు పోతున్న మద్యానికి వర్తింపచేస్తే ఎంతమేర అదనపు ఆదాయం వస్తుందో అంచనా వేయవచ్చు. రాష్ట్రంలో ఈ నెల 14న రూ.136 కోట్ల విలువైన 1,49,513 కేసుల లిక్కర్.. 2,24,672 కేసుల బీరు అమ్ముడుపోయింది. లిక్కర్ ఒక్కో కేసుకు 12 ఫుల్ బాటిళ్లు లెక్కన తీసుకుంటే... 17,94,156 లిక్కర్ బాటిళ్లు.. సగటున 20శాతం పెరిగిందనుకుంటే ఒక్కోబాటిల్‌పై సగటున 100 పెరిగినట్లు అంచనా. అంటే ఒక్క రోజులో అమ్ముడుపోతున్న17.94 లక్షల లిక్కర్ బాటిళ్లపై 100 పెరిగిందనుకుంటే.. 17.94 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. దీనిని 365 రోజులుగా వర్తింపచేసినట్లయితే 6,548.67 కోట్లు అదనంగా రాబడి వస్తుందని అంచనా వేయవచ్చు. అదే విధంగా బీరు ఒక్కోకేసుకు 12 ఫుల్ బాటిళ్లు లెక్కన తీసుకుంటే రోజుకు 26.96లక్షల బాటిళ్లు అమ్ముడు పోతున్నాయి. ఒక్కో బాటిల్‌పై 10లెక్కన ధర పెరగడంతో 2.69కోట్ల ఒక్క రోజులో అమ్ముడు పోయే బీరుపై అదనంగా ఆదాయం వస్తోంది. ఈ మొత్తాన్ని365 రోజులకు వర్తింప చేసినట్లయితే 984.06 కోట్ల అదనపు రాబడి వస్తుందని అధికారుల అంచనా. మొత్తం మీద ఏడాదికి లిక్కర్, బీర్లు అమ్మకాలపై రూ.7,532.73 కోట్లు అదనపు రాబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.