మామూళ్లతో అబ్కారీ శాఖ ఆదాయం మామూలుగా లేదుగా.. Excise Department Extra Revenue: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు సహా ఎక్సైజ్ చట్టం అమలు చేయాల్సిన అధికారులు కొందరు గాలికొదిలేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా మామూళ్లు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా పర్మిట్ గదులు ఏర్పాటు చేసుకోవాలని దుకాణదారులకు అనుమతిచ్చారు. మద్యం దుకాణానికి అనుబంధంగా 50 చదరపు మీటర్లు విస్తీర్ణంలో పర్మిట్ గది ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిబంధలు లేవి: కానీ, చాలా చోట్ల నిబంధనలు పాటించడం లేదు. నియమాలు ఉల్లంఘిస్తున్నారని తెలిసినా... ముడుపులు పుచ్చుకుంటూ కొందరు ఎక్సైజ్ అధికారులు నోరు మెదపట్లేదని ఆరోపణలున్నాయి. లైసెన్స్‌దారుడి స్థానంలో డిపోల నుంచి మద్యం తెచ్చుకోవడానికి దుకాణంలో పనిచేసే వారి పేర్లు నౌకర్ నామా కింద అధికార్ల వద్ద నమోదు చేయించాలి. ఇందుకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున చెల్లించాలి. కానీ, ఒకరిద్దరిని మాత్రమే నౌకర్ నామా కింద చూపించి... మిగిలిన వారిపేర్లు నమోదు చేయకపోయినా కొందరు అధికారులు జరిమానా విధించకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.
ముడుపులు: కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్స్‌లు పొందినవారు... గుడ్‌విల్ కింద ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోంది. లైసెన్స్ ఫీజు ఆధారంగా రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఇవ్వాల్సి వస్తోందని... ఇది కొన్నేళ్లుగా సంప్రదాయంగా వస్తోందని మద్యం దుకాణదారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకుంటే... ఆ దుకాణంపై తరచూ సోదాలు నిర్వహిస్తూ... ఇబ్బందులకు గురి చేస్తారని తెలిపారు. మద్యం నిల్వలకు సంబంధించి స్టాక్ బుక్‌లో రోజువారీ అమ్మకాలు... నిల్వలు రాసుకోవటం లేదా నకలు కాపీని అంటించాలన్న నిబంధనను... చాలామంది బేఖాతరు చేస్తారు. అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడల్లా రూ. 10 నుంచి రూ. 20వేలు జరిమానా విధిస్తారు. ఇదంతా లేకుండా ఎంతో కొంత ముట్టజెప్పుతున్నట్లు సమాచారం.
ఆదాయ వనరు: గతంలో మద్యం దుకాణాల నుంచి వచ్చే మామూళ్లే... ఎక్సైజ్, పోలీసు స్టేషన్లకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది . కాలక్రమేణా పోలీసుశాఖ నుంచి మామూళ్ల ఒత్తిడి బాగా తగ్గినట్లు దుకాణదారులు చెబుతున్నారు. నిర్దేశించిన సమయం కంటే ఎక్కువసేపు అమ్ముకోడానికో... దుకాణం వద్ద పార్కింగ్ లేకపోయినా... వాహనాలు అడ్డంగా పెట్టినా చూసీచూడనట్లు పోతున్నందుకు... కొందరు స్వచ్ఛందంగా ప్రతినెల కొంత మొత్తాన్ని పోలీసులకు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతినెల ముట్టజెప్పాల్సిందే: జిల్లాల్లో ఎక్సైజ్ స్టేషన్లకు రూ. 40 నుంచి రూ. 50వేలు ఇచ్చుకోవాల్సి వస్తుండగా... హైదరాబాద్‌లో రూ. 25 నుంచి రూ. 30వేలు ప్రతినెల ముట్టజెప్పాల్సి వస్తోందని దుకాణదారులు చెబుతున్నారు. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల కంటే ఎక్కువ మెుత్తంలో పబ్‌ల నుంచి ముడుపులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉల్లంఘనలను చూసీ చూడకుండా వదలియాలంటే ...ఆ మాత్రం ఇచ్చుకోక తప్పదని ఓ పబ్ యజమాని తెలిపారు. లేదంటే చిన్నచిన్న వాటికి జరిమానాలు విధించి వేధిస్తారని వివరించారు. ప్రధానంగా ధరల పట్టిక ప్రదర్శన, 21 ఏళ్ల వారికి మద్యం అమ్మొద్దన్న బోర్డు, మద్యం తాగరాదని బ్యానర్లు ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు నాలుగు ఏర్పాటు చేయాలని నిబంధన ఉంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా తూతూమంత్రంగా కానిస్తున్నారు.
హైదరాబాద్ బయట కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు నిర్దేశిత సమయం కంటే ముందే మూసివేస్తున్నారు. కానీ, అంతకుముందే దగ్గర్లోని కిరాణాలకు, మిర్చిబజ్జీ బండ్లకు సరకు చేరవేస్తున్నారు. ఎమ్మార్పీ ధర కంటే రూ. 10 నుంచి రూ. 20 ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటిని అనధికారికంగా విక్రయిస్తూ... రూ. 40 నుంచి రూ. 50 అదనంగా వసూలు చేస్తారు. డిమాండ్ ఉన్న వాటికి 100 కూడా తీసుకుంటున్నారు. వీటన్నింటిని చూసీ చూడనట్లు వ్యవహరించేందుకు అధికారులకు ముడుపులు ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని చోట్ల కొందరు రాజకీయ నాయకులు మద్యం దుకాణాల నుంచి తక్కువలో తక్కువ రూ. 15 వేల నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
రూ. 205కోట్లకు పైగా: రాష్ట్రంలో 2 వేల 620 మద్యం దుకాణాలు... 11 వందల 65 బార్ అండ్ రెస్టారెంట్లు, 29 క్లబ్‌లు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 3 వేల 814 లైసెన్స్‌లు కలిగిన మద్యం విక్రయ కేంద్రాలున్నాయి. వీటన్నింటికి ప్రతి నెలా కనీసం 30వేలకు తక్కువ కాకుండా 60వేలు అంతకంటే ఎక్కువ పోలీసు, ఎక్సైజ్, రాజకీయనాయకులకు ఇచ్చుకోవాల్సి వస్తోందని లిక్కర్ అసోసియేషన్ చెబుతోంది. ఇదే నిజమైతే ఒక్కో విక్రయ కేంద్రం నుంచి సగటున రూ. 45వేలు అనుకున్నా... రాష్ట్రవ్యాప్తంగా దుకాణాల నుంచి రూ. 17కోట్ల 16లక్షల 30వేలు మాముళ్ల రూపంలో అందుతున్నాయి. అంటే ఏడాదికి రూ. 205 కోట్లకు పైగా చేతులు మారుతున్నాయని అంచనా.
వసూళ్లైన మొత్తం.. కింద స్థాయి సీఐ నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరకు ప్రతి నెలా పంపకాలు జరుగుతాయి. ఉన్నతాధికారులైన సహాయ, డిప్యూటీ కమిషనర్లకు ప్రతి మూడు నెలలకోసారి లక్షల్లో ముట్టచెప్పే సంప్రదాయం కొనసాగుతోందని తెలుస్తోంది.
ఇవీ చదవండి: