హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఇటీవల హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి) వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. అయితే, వివిధ కారణాల వల్ల ఇందులో కొన్ని ఫ్లాట్లు అమ్ముడు పోలేదు. దీంతో మిగిలిన ఫ్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపింది.
టోకెన్ అడ్వాన్స్ చెల్లింపులకు సిద్ధంగా ఉన్నవారికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయింపు చేయనున్నట్లు తెలిపింది. ఫ్లాట్లకు టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు జనవరి 18 వరకు గడువు విధించింది. అయితే, వరుస సెలవుల దృష్ట్యా టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు గడువును ఫిబ్రవరి 12 వరకు పొడిగిస్తున్నట్టు హెచ్‌ఎండీఏ తెలిపింది. www.hmda.in, www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్లలో ఫ్లాట్లు, ఇతర వివరాలు చూడొచ్చని పేర్కొంది.
హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించిన స్లాబుల ప్రకారం వేలంలో 1 బెడ్ రూమ్, హాల్, కిచెన్ కలిగిన ఫ్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఒక లక్ష.. అలాగే రెండు బెడ్ రూమ్స్, హాల్ విత్ కిచెన్ కలిగిన ఫ్లాట్లను సొంతం చేసుకోవాలనుకునే వారు 2 లక్షలు రూపాయలు టొకెన్ అడ్వాన్స్ కింద చెల్లించాల్సి ఉంటంది. 3 బెడ్ రూమ్స్ ఫ్లాట్లకు పోటీపడే వారు 3 లక్షల రూపాయల టొకెన్ అడ్వాన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వేలం బిడ్డింగ్‌లో పాల్గొన్న వారికి ఎప్పటిలాగే లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టంచేశారు