తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​లో వైద్యుల పదవీ విరమణ వయసు పొడిగింపు - వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

నిమ్స్​లో వైద్యుల పదవీ విరమణ వయసును ఐదేళ్లకు పెంచుతూ నిమ్స్​ పాలక మండలి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిమ్స్‌లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుండగా... ఇప్పుడు 65 సంవత్సరాలకు పెంచారు.

Extension of Doctors' Retirement Age in NIMS
నిమ్స్​లో వైద్యుల పదవీ విరమణ వయసు పొడిగింపు

By

Published : Jul 4, 2020, 1:50 PM IST

నిమ్స్‌లో వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచారు. గతేడాదే బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం నిమ్స్‌లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుండగా.. మరో ఐదేళ్లకు పెంచుతూ నిమ్స్‌ పాలక మండలి ఈ ఏడాది మార్చిలోనే నిర్ణయం తీసుకుంది.

ఆ నిర్ణయానికి తాజాగా ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ఏడాది మార్చి నుంచే ఇది వర్తించనుందని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల నిమ్స్‌ వైద్యులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

దీంతోపాటు పదోన్నతులపైనా నిమ్స్‌ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కిందట దాదాపు 45 మందికి పదోన్నతులు లభించగా, అప్పటి నుంచి వైద్యులు వేచి చూస్తున్నారు. తాజా నిర్ణయంతో 19 మందికి వేర్వేరు స్థాయిల్లో పదోన్నతులు లభించాయని నిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

తాజా పదోన్నతులను ఏ స్థాయిలో పొందినా... వారికి కూడా ఈ ఏడాది మార్చి నుంచే ఆ హోదాను వర్తింపజేయనున్నారు. అయితే పదోన్నతుల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను మాత్రం ఇప్పట్లో చెల్లించలేమని, ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అది సాధ్యం కాదని నిమ్స్‌ వైద్యులకు పాలక మండలి తెలిపింది.

ఇవీ చూడండి:కొత్తరకం కరోనాతో మరింత కంగారు

ABOUT THE AUTHOR

...view details