గ్రేటర్ పరిధిలో ప్రధాన ప్రాంతాలకు అనుసంధానంగా 120 చోట్ల సంచార రైతుబజార్ వాహనాలు కూరగాయలను విక్రయిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎర్రగడ్డ రైతు బజారు నుంచే ఏజెంట్లు ఎక్కువగా కూరగాయలను ట్రక్కుల్లో తీసుకెళ్తున్నారు. ప్రతీ కాలనీ, ప్రాంతంలో వారంలో రెండు రోజులు కూరగాయలను విక్రయిస్తున్నారు. అమ్మకాలు తొందరగా పూర్తైతే గిరాకీ ఆధారంగా మళ్లీ తెప్పిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మార్కెట్లకు వెళ్లకుండా సంచార రైతుబజార్ల వద్దకు వస్తున్నారు. కూరగాయల ధరలు ఏజెంట్లు ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే. టమాటాలు మార్కెట్‌లో రూ.20లు ఉంటే వ్యాన్‌లోనూ అంతే.. మీ వద్ద తక్కువగా ఉండాలి కదా అంటే.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేదంటే లేదు అంటూ పంపుతున్నారు. ఇంటికి వెళ్లాక చూసుకున్నా.. తూకం కూడా తక్కువగా ఉంటోందని మహిళలు ఆరోపిస్తున్నారు.
నిఘాలేమి.. దోపిడీకి మార్గం
సంచార రైతుబజార్ల ఎంత రేట్లుకు విక్రయిస్తున్నారో చూడాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏజెంట్లు రోజుకు రూ.లక్షల్లో అదనంగా సంపాదిస్తున్నారు. కొందరు ఏజెంట్లకు, రైతుబజార్లలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిలో మిలాఖత్ అవడంతోనే వీరి కార్యకలాపాలపై నిఘా ఉండడం లేదని తెలిసింది. ఈ విషయమై ఎర్రగడ్డ రైతుబజార్ ఎస్టేట్ అధికారి రమేష్‌ను ప్రశ్నించగా.. ఆనంద్‌నగర్‌లో సంచార రైతుబజార్ ఏజెంట్‌కు రూ.500లు జరిమానా విధించామని చెప్పారు. అప్పటికే రూ.వేలల్లో విక్రయించారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. నిబంధనల ప్రకారం జరిమానా మాత్రమే విధించామని వివరించారు.
మేం ఇంతే అమ్ముతాం..
ఆనంద్‌నగర్ కాలనీకి శనివారం ఉదయం ఎర్రగడ్డ రైతుబజార్‌కు అనుసంధానంగా ఉన్న సంచార రైతు బజార్ వాహనం వచ్చింది. టమాటా కిలో రూ.13లు అమ్మాల్సి ఉండగా.. కిలో రూ.20లు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కిలో రూ.28లు ఉండగా.. రూ.40లు తీసుకుంటున్నారు. వంకాయ రూ.20లు కాగా.. రూ.40కి అమ్ముకుంటున్నారని రమణారావు చెప్పారు. కూరగాయల మార్కెట్‌లో టమాటా రూ.15లు ఇస్తున్నారని ప్రశ్నించగా మా సేఠ్ చెప్పిండు.. మేం ఇంతకే అమ్ముతాం.. మీరు కంప్లైంట్ చేసుకుంటే మా సేఠ్ నంబర్ లారీకి ఉంది. ఆయనకే ఫోన్ చెయ్యండి అంటూ మాట్లాడారు.
రెట్టింపు ధరలతో సంచార రైతుబజార్‌లలో అడ్డగోలు దోపిడీ..!
కరోనా కష్టకాలంలో ఇంటి వద్దకే కూరగాయలు తెస్తున్న సంచార రైతు బజార్ ఏజెంట్లు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నుంచి నగరంలోని వేర్వేరు కాలనీల్లో కూరగాయలు విక్రయించేందుకు అనుమతులు తీసుకున్న ఏజెంట్లు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రైతు బజార్‌లో ధరల పట్టీ కంటే కిలోకు ఐదు రూపాయలు మాత్రమే ఎక్కువగా అమ్మాల్సి ఉండగా.. రెట్టింపు ధరలు విక్రయిస్తున్నారు. సంచార వాహనం వద్ద ధరల బోర్డు ఉంచలేదు సరికదా.. ఇష్టానుసారంగా విక్రయిస్తూ జనం నుంచి రోజుకు రూ.లక్షల్లో దండుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 41 వాహనాల ద్వారా నెలకు రూ.కోట్లు దోచుకుంటున్నారు. ఎక్కువ ధరలు తీసుకుంటున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమాత్రం పర్యవేక్షించడం లేదు.
సంచార రైతుబజార్‌లలో అడ్డగోలు దోపిడీ