తెలంగాణ

telangana

ETV Bharat / state

Mental stability in Kids : మీ పిల్లల్లో ఈ మార్పులు గమనించారా..? - Mental stability in children

Mental stability in Kids : కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా చిన్నా-పెద్దా అని తేడా లేకుండా చాలా మంది ఇంటిపట్టునే ఉన్నారు. ఈ క్రమంలో కొందరిళ్లల్లో బంధాలు మరింత బలపడగా.. మరికొందరి ఇళ్లల్లో మాత్రం మనస్పర్ధలు పెరిగాయి. ఈ ప్రభావం ఇంట్లోనే ఉన్న చిన్నారులపై పడింది. తల్లిదండ్రుల మధ్య ఘర్షణలతో చిన్నారుల్లో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బడుల ప్రారంభం వేళ పిల్లలకూ మానసిక స్థైర్యం అవసరమంటున్నారు నిపుణులు.

Mental stability in Kids
Mental stability in Kids

By

Published : Jun 13, 2022, 7:03 AM IST

Mental stability in Kids : కొవిడ్‌ నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో అనేక మంది ఇంటి పట్టునే ఉన్నారు. ఎక్కువ కాలం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండటంతో.. కొందరిళ్లల్లో బంధాలు బలపడగా.. మరికొన్ని చోట్ల మనస్పర్ధలు తలెత్తాయి. ఆ ప్రభావం చిన్నారులపై పడింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు పిల్లలు బానిసలుగా మారడం కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణమైంది. తమకు తెలియకుండానే బిడ్డలు ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక రుగ్మతల బారినపడ్డారు. ఇటువంటి పరిస్థితే బ్రిటన్‌లో ఎదురైనప్పుడు.. అక్కడ అన్ని విద్యాసంస్థల్లోనూ సైకాలజిస్ట్‌లను నియమించారు. పిల్లల్లో మనోవికాసానికి దోహదపడ్డారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వేళ మన దగ్గర కూడా సైకోథెరపిస్టుల సేవలను వినియోగించాలంటున్నారు నిపుణులు.

ఘర్షణకు సాక్ష్యంగా..

Mental stability in Children : కొవిడ్‌కు ముందు పొద్దున 7-8 గంటలకు ఇంట్లోంచి బడికి వెళ్తే.. సాయంత్రం 4-5 గంటలకు వచ్చేవారు. ఆ తర్వాత ఆడుకోవడం, టీవీ చూడటం, హోంవర్కు.. పడుకోవడంతో రోజు గడిచిపోయేది. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఎప్పుడైనా ఘర్షణ వాతావరణం తలెత్తినా.. అందుకు పిల్లలు సాక్షీ భూతంగా నిలిచే అవకాశాలు చాలా తక్కువ. కొవిడ్‌ కాలంలో ఇంట్లోనే ఉండటంతో ఎక్కువ సందర్భాల్లో తల్లిదండ్రుల మధ్య ఘర్షణ తలెత్తితే ఆ ప్రభావం.. పిల్లలపై పడింది.

సాంకేతికతతో చేటు..

కొవిడ్‌ కాలంలో సాంకేతిక పరికరాలను అనివార్యంగా పిల్లలు వాడాల్సి వచ్చింది. అత్యధిక సంఖ్యలో చిన్నారులు సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లకు బానిసలుగా మారారు. అరచేతిలో ప్రపంచం కనిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు తెలియకుండానే తప్పుడు వెబ్‌సైట్‌లోకి చొరబడే ప్రమాదమూ ఉంది. అవాంఛనీయ వెబ్‌సైట్‌లను చూడడం వల్ల కూడా పిల్లలపై మానసికంగా దుష్ప్రభావం పడుతుంది. సామాజిక మాధ్యమాల ప్రభావమూ ఎక్కువైంది. కొవిడ్‌ కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు చదువులో వెనుకబడ్డారు. కొవిడ్‌ కాలంలో చాలా మంది పిల్లల్లో మంచి నిద్ర, శారీరక శ్రమ, బలవర్ధకమైన ఆహారం దూరమయ్యాయి. ఆలస్యంగా నిద్ర లేవడం.. భోజన సమయంలో అల్పాహారం తీసుకోవడంతోపాటు జంక్‌ఫుడ్‌కు అలవాటయ్యారు. బడిలో ఉంటే ఆటలు ఆడుకునేవారు. కానీ ఇంట్లోనే ఉండడం వల్ల శారీరక శ్రమకు దూరమయ్యారు.

ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించడమెలా?

ఒత్తిడిలో ఉన్నప్పుడు కొందరు తిండి ఎక్కువగా తింటారు. మరికొందరు అతిగా నిద్రపోతారు. నిద్ర సరిగారాని వారు కొందరు. గతంలో ఉత్సాహంగా బయటకు వెళ్లేందుకు ముందుకొచ్చిన పిల్లలు.. ఇప్పుడు మొండికేయడం కూడా ఒత్తిడికి ఒక సంకేతమే. కొవిడ్‌ కంటే ముందు చదువులో మంచి ప్రతిభ చూపే పిల్లల్లో ఇప్పుడు ఆ చురుకుదనం తగ్గిపోయిందంటే ఏదో జరిగిందని గ్రహించాలి.

బ్రిటన్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరు..

బ్రిటన్‌లో ఒక అధ్యయనం ప్రకారం..2017లో ప్రతి 9 మందిలో ఒకరికి మానసిక సమస్యలుండగా.. ఇప్పుడు ప్రతి ఆరుగురిలో ఒకరు ఒత్తిడిలో ఉన్నారు. 6-16 ఏళ్ల మధ్యవయస్కుల్లో ప్రతి అయిదుగురిలో ఇద్దరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని చక్కదిద్దడంపై బ్రిటన్‌ ప్రభుత్వం దృష్టిపెట్టింది. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో భాగంగా ప్రతి బడి, కళాశాలలోనూ మానసిక కౌన్సెలర్లను నియమించింది. ఇక్కడ సైకాలజీ కూడా విద్యాభ్యాసంలో ఒక భాగంగా మారింది. దీనివల్ల బ్రిటన్‌లోని 4,700 విద్యాసంస్థల్లో 24 లక్షల మంది పిల్లలు లబ్ధిపొందారు.

విద్యాసంస్థల్లో సైకాలజీని భాగం చేయాలి..-సుజాత రాజామణి, క్లినికల్‌ సైకోథెరపిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్‌

నిద్ర సరిపోకపోతే పిల్లల్లో చిరాకు, కోపం వంటివి వస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కౌమార దశలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఫలితంగా భావోద్వేగాల్లోనూ తేడాలొస్తాయి. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు సానుకూలంగా ఉండాలి. శారీరక శ్రమ చేయడాన్ని ప్రోత్సహించాలి. తద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. మీకు మేమున్నామనే భరోసాను తల్లిదండ్రులు కల్పించాలి. లేకపోతే దాన్ని పిల్లలు బయట వెతుక్కుంటారు. సిగరెట్‌, మద్యం, డ్రగ్స్‌ వంటి దురలవాట్లకు బానిసయ్యే ప్రమాదమూ ఉంది. పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు గొడవ పడకూడదు. మన దగ్గర కూడా విద్యాసంస్థల్లో సైకాలజీని భాగం చేయాలి. సైకోథెరపిస్ట్‌లను నియమించాలి.

తల్లిదండ్రులకు ఎదురుతిరగడం ఎక్కువైంది..-డాక్టర్‌ ఘంటా సతీష్‌, పిల్లల వైద్య నిపుణులు

ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, ఆటిజం, అటెన్షన్‌ డెఫిసిట్‌ అండ్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ), అపోజిషనల్‌ డిఫైన్‌ డిజార్డర్స్‌(ఓడీడీ)..అంటే చిన్న విషయాలకు కూడా తల్లిదండ్రులతో విభేదించడం.. ఎదురు సమాధానాలు చెప్పడం చేస్తున్నారు. ఇంట్లో ఘర్షణ వాతావరణం..ఒత్తిడి, సామాజికంగా ఎవరినీ ఎక్కువగా కలుసుకోలేని దుస్థితి వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలను ప్రారంభించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఫ్యామిలీ ఫిజీషియన్లే కౌన్సెలర్ల పాత్ర పోషించాలి.

ఇవీ చూడండి..
Schools Reopened in Telangana : తెలంగాణలో బడి గంట మోగింది

అల్లర్ల కారకులపై కన్నెర్ర.. యూపీలో 304 మంది అరెస్టు

ABOUT THE AUTHOR

...view details