నిమ్స్‌లో ఒక స్టాఫ్‌నర్సుకు ఆరునెలల కిందట మొదటిసారి కొవిడ్ సోకింది. అక్కడే చికిత్స పొందగా నయమైంది. రెండు డోసుల కొవిడ్ టీకాలను కూడా స్వీకరించారు. ఇటీవల ఆ స్టాఫ్‌నర్సు మళ్లీ కరోనా బారినపడ్డారు. అయితే స్వల్ప చికిత్సతోనే ఆమె కోలుకున్నారు. అలాగే పోలీసు శాఖలో నలుగురికి రెండోసారి కరోనా సోకింది. ఇలా ఒకసారి కొవిడ్ సోకిన వారిలో సుమారు 5 శాతం లోపు వ్యక్తులు రెండోసారి వైరస్ బారినపడుతున్నారు. రెండుడోసుల టీకాలు పొందిన వారిలోనూ ఒక శాతం లోపు మళ్లీ మహమ్మారి కోరలకు చిక్కుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ ఒకే వ్యక్తికి రెండుసార్లు సోకడం అసాధారణమేమీ కాదంటున్నారు వైద్య నిపుణులు. రెండుడోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంటుందనీ, ఐసీయూల్లో చేరి వెంటిలేటర్ చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదురుకావని స్పష్టం చేస్తున్నారు.
ఎందుకిలా మళ్లీ దాడి?
సాధారణంగా కరోనా బారిన పడిన తర్వాత బాధితుల్లో.. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. సుమారు 30 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందకపోవచ్చు కూడా. యాంటీబాడీలు వృద్ధి చెందిన వారిలోనూ అవి ఎంతకాలం నిల్వ ఉంటాయనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుతమున్న అంచనాల ప్రకారం... 3-12 నెలల వరకు యాంటీబాడీలు శరీరంలో ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొందరిలో 3 నెలల్లోనే యాంటీబాడీలు అంతర్ధానమవ్వొచ్చు.. మరికొందరిలో ఏడాది పాటు కూడా ఉండొచ్చు. కొవిడ్ బారినపడినా యాంటీబాడీలు వృద్ధి కానివారిలో.. ఒకవేళ వృద్ధి చెందినా తక్కువకాలంలోనే కనుమరుగైన వారిలో.. తిరిగి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక రెండు డోసులు టీకాలు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ ఎందుకు సోకుతోందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీకా సమర్థత కూడా 70-80 శాతమేనన్నది గుర్తుంచుకోవాలని నిపుణులు అంటున్నారు. మిగిలిన 20-30 శాతం మందిలో టీకా పొందిన తర్వాత కూడా యాంటీబాడీలు వృద్ధి కాకపోవచ్చు. ఇటువంటి వారిలో కరోనా వైరస్ రెండోసారే కాదు.. 3,4 సార్లు కూడా సోకే అవకాశాలుంటాయని వైద్యులు విశ్లేషిస్తున్నారు.
ప్రాణాంతక పరిస్థితులు రానే రావు
తొలిడోసు టీకా పొందిన తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అయితే రెండోడోసు తీసుకున్న 14 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుంది. కొందరిలో టీకా పొందిన తర్వాత కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ ప్రాణాంతక పరిస్థితులు రానే రావు. రెండు డోసుల తర్వాత వైరస్ సోకిన వారిలో 90 శాతం మందిలో అసలు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కనిపించినా స్వల్పంగా ఉంటున్నాయి. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే అవకాశాలు బహు స్వల్పం. ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాలు ఒక శాతమే. ఇప్పటివరకూ రెండు డోసుల టీకాలు పొందినవారిలో కొవిడ్ కారణంగా మృతిచెందిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. టీకా ఇంత బలమైన రక్షణ ఇస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. అయితే ఒక్కమాట గుర్తుంచుకోవాలి. వైరస్ సోకినప్పుడు.. టీకా పొందినవారికి హాని కలిగించకపోయినా.. వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. అందుకే టీకా పొందినవారితో పాటు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. - డాక్టర్ ఎంవీ రావు, ప్రముఖ జనరల్ ఫిజీషియన్, యశోద ఆసుపత్రి