తెలంగాణ

telangana

ETV Bharat / state

Annamayya Dam Collapse: అన్నమయ్య, పింఛ కట్టల విధ్వంసం.. విపత్తా? వైఫల్యమా?

Annamayya Dam Collapse: ఏపీలోని కడప జిల్లాలోని అన్నమయ్య, పింఛ కట్టల విధ్వంసంతో పెను నష్టాన్ని మిగిల్చింది. దీనికి భారీ వరదే కారణమని అధికార వర్గాల వాదిస్తున్నప్పటికీ.. జల వనరుల రంగ నిపుణుల ప్రశ్నలు వేస్తున్న ప్రశ్నలు వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్నాయి. జలాశయాలు ముందుగా ఖాళీ చేయకపోవడం, సకాలంలో మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

annamayya dam collapse, annamayya dam, annamayya collapse
అన్నమయ్య జలాశయం

By

Published : Dec 6, 2021, 12:40 PM IST

Annamayya Dam Collapse: ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జలాశయంలో నవంబరు 18 రాత్రి 8.30 సమయంలో 1.590 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఒక గేటు పని చేయకపోయినా 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపవచ్చు. మూడు రోజులు అతిభారీ వర్షాలని ప్రభుత్వమే చెబుతోంది. 87,296 క్యూసెక్కుల ప్రవాహాలు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. మరి ఆ సమయంలో 1.20 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? అదేరోజు అర్ధరాత్రి ప్రాజెక్టులో నీటి నిల్వ 1.805 టీఎంసీలకు పెరిగింది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.71లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుంటే 1.46 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? భారీ వరద వస్తున్నప్పుడు జలాశయంలో నీటి నిల్వ పెంచేలా ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చేయడం ఏమిటి? ఆ తర్వాత రెండు మూడు గంటలకు కట్ట కొట్టుకుపోతే దీన్ని ప్రకృతి విపత్తు అనాలా? ప్రాజెక్టు నిర్వహణలో లోపం అనాలా? అన్న చర్చ సాగుతోంది.

అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన. కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో అలక్ష్యం కూడా ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.

వాదన 1:కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడంతో, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాజెక్టులకు ప్రమాదం సంభవించింది.

నిపుణుల చర్చ:

మూడు రోజులు అతి భారీవర్షాలు కురిశాయని ప్రభుత్వమే చెబుతోంది. అన్నమయ్య జలాశయానికి పైన బాహుదా, పింఛ, మాండవ్య మీదుగా నీటి ప్రవాహాలుంటాయి. ఆ మూడు కలిసిన చెయ్యేరు మీదే అన్నమయ్య జలాశయం ఉంది. అతి భారీవర్షాల వల్ల వరద వస్తుందని ఇంజినీరింగు అధికారులు అంచనా వేయగలరు. ఆ పరీవాహకంలో ఎక్కడ ఎంత వర్షం పడిందో లెక్కలూ అందుబాటులో ఉంటాయి. భారీవర్షాలు ప్రారంభమైన మూడోరోజు అర్ధరాత్రి తర్వాత రెండు జలాశయాల కట్టలు తెగాయి. అన్నమయ్య జలాశయంలో నిల్వ ఉన్న 1.590 టీఎంసీల నీటిని ముందే ఖాళీ చేసి వరద నీటిని నింపేందుకు సిద్ధంగా ఉండాలి కదా? అలా ఎందుకు చేయలేదన్నది జలవనరుల నిపుణుల ప్రశ్న.

వాదన 2: అన్నమయ్య స్పిల్‌ వే ప్రవాహ సామర్థ్యం 2.25 లక్షల క్యూసెక్కులు. వచ్చిన వరద 3.20 లక్షల క్యూసెక్కులు. ఇలా ఎక్కువగా రావడం వల్లే కట్టలు కొట్టుకుపోయి ప్రాణనష్టం సంభవించింది.

నిపుణుల అభిప్రాయం:

2009 అక్టోబరులో శ్రీశైలం జలాశయంలో ఎదురైన అనుభవం తెలిసిన వారెవరైనా ఈ వాదన సరైనదే అనగలరా? 2009 అక్టోబరులో శ్రీశైలం జలాశయానికి అనూహ్య స్థాయిలో వరదలు వచ్చాయి. శ్రీశైలం జలాశయం స్పిల్‌ వే సామర్థ్యం 15 లక్షల క్యూసెక్కులు. వచ్చిన వరద 25 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న రక్షణ కట్ట దాటి పైనుంచి నీరు పొర్లిపోయే పరిస్థితి. దిగువన నాగార్జునసాగర్‌ నిండు కుండలా ఉంది. విజయవాడకు పెను ప్రమాదం ఉన్న నాటి పరిస్థితిలో జలాశయాన్ని కాపాడుకోగలమా లేదా అన్న భయాల మధ్య జలవనరులశాఖ అధికారులు ముందుజాగ్రత్తలతో ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించారని నిపుణులు గుర్తుచేశారు. అప్పట్లో అంతలా చేసినా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఎదుర్కోవలసి వచ్చిందనీ అన్నారు.

సకాలంలో నిర్ణయాలు ఏవీ?

అన్నమయ్య జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో, గేట్లు ఎత్తే విషయంలో జలవనరులశాఖ అధికారులకు.. రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం కనిపించింది. కొందరు ఉన్నతాధికారులు అక్కడి జలవనరులశాఖ అధికారులను వివరణ కోరగా.. ప్రవాహాల తీరుపై రెవెన్యూ అధికారులకు వర్తమానం పంపామని, ముందస్తు అనుమతి లేకుండా జలాశయాలు ఖాళీ చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ అధికారుల అనుమతి కోసం ఎదురు చూశామన్నారు. అంతే కాదు.. రెవెన్యూ అధికారులకు జలవనరులశాఖ స్థానిక అధికారులు పంపిన సందేశాల ప్రతులనూ ఉన్నతాధికారులకు సమర్పించారు. సకాలంలో ప్రాజెక్టులు ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకోకపోవడమూ ఒక కారణంగా నిపుణులు వాదిస్తున్నారు.

ప్రాజెక్టుల నిర్వహణలో జాగ్రత్తలు ఏవీ?

ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు.. నిర్వహణ కూడా అంతే ముఖ్యం. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు గతేడాది నవంబరులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నమయ్యలో అయిదో గేటు పని చేయట్లేదు. మరమ్మతు పనుల కోసం రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా, నిధులు మంజూరు కాలేదు. అప్పుడు దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులకు రూ.4 కోట్లు కూడా ఇవ్వలేరా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:Annamayya Reservoir Disaster: తెగిన మట్టికట్ట... గూడు పోయి గోడు మిగిలింది..

ABOUT THE AUTHOR

...view details