తెలంగాణ

telangana

ETV Bharat / state

Seed Bowl of India News:తెలంగాణ కిరీటంలో మరో అద్భుతమైన కలికితురాయి.. ఎలా సాధ్యమైంది?

తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా(Seed Bowl of India News) పేరుగాంచిన రాష్ర్టాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెలలో ఇటలీ రాజధాని రోమ్‌ నగరం వేదికగా జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సుకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది...ఎఫ్​ఏవో సంస్థ. దేశంలో ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. 7 ఏళ్ల వయసు గల తెలంగాణ రాష్ట్రం ఈ ఘనత ఎలా సాధించింది..? ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది..? వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులేంటి..? తెలుసుకుందాం రండి!

Seed Bowl of India News, Telangana seeds news
సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ విత్తనాలు

By

Published : Nov 9, 2021, 10:05 AM IST

Updated : Nov 9, 2021, 1:20 PM IST

ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ విజయంపై ప్రసంగించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ- ఎఫ్​ఏవో(FAO) నుంచి రాష్ట్రానికి ఆహ్వానం అందింది. ఈ నెల 4,5 తేదిల్లో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై ఇటలీ రాజధాని రోమ్‌లో FAO అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో... ఎ సక్సెస్‌ స్టోరీ ఆఫ్‌ ఇండియా... తెలంగాణ స్టేట్‌ యాజ్‌ ఏ గ్లోబల్‌ సీడ్‌ హబ్‌9Seed Bowl of India News) అనే అంశంపై ప్రభుత్వం తరఫున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(Seed Bowl of India News) మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు ప్రసంగించారు. రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న మౌలిక వసతులు, విత్తన పరిశ్రమల సామర్థ్యం, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సీడ్‌బౌల్‌ కార్యక్రమాలను ఆయన వివరించారు. అన్ని దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సభలో... తెలంగాణ ఖ్యాతి రెపరెపలాడటం గర్వకారణమంటున్నారు..వ్యవసాయాధికారులు.

సీడ్ కాపిటల్ ఆఫ్ ఇండియా

సీడ్ కాపిటల్ ఆఫ్ ఇండియా(Seed Bowl of India News)... తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యమిది. ఏడేళ్లలోనే ఈ కలను సాకరం చేసుకుంది. అందుకు గల ప్రధాన కారణం... రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన నిల్వలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ప్రాంతం విత్తనోత్పత్తిలో అగ్రగామిగా ఉండేది. చక్కటి నైపుణ్యం గల విత్తన రైతులు, మౌలిక సదుపాయాలు ఉండటం వల్లవివిధ రకాల పంటల్లో నాణ్యమైన విత్తనోత్పత్తి సాగుతుంది.

విత్తన రంగంపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విత్తన రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల అభ్యున్నతి కోసం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న పథకాలు నాణ్యమైన విత్తనోత్పత్తికి మరింత చేయూతనిచ్చాయి. అలాగే, కల్తీ విత్తనాల సరఫరాకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్రంలో పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఏటా వానా కాలం, యాసంగి సీజన్ల ఆరంభంలో పెద్ద ఎత్తున దాడులు, సోదాలు నిర్వహించడం ద్వారా భారీగా నాసిరకం విత్తనాలు, నిల్వలు, అమ్మకాలు, రవాణా వంటి కార్యకలాపాలు నియంత్రిస్తున్నారు. నాసిరకం విత్తనాల తయారీ, సరఫరాదారులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు ఏకంగా పీడీ చట్టం సైతం ప్రయోగిస్తున్నారు. దీనిని బట్టే చెప్పొచ్చు.. ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుందో. రాష్ట్ర విత్తన సంస్థలు, విత్తన క్షేత్రాలను పటిష్ఠపరచడం కోసం సీడ్ రెగ్యులేటరీ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మూల విత్తన తయారీ చూస్తే... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్ - భారత వరి పరిశోధన సంస్థ, జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ, భారత నూనెగింజల పరిశోధన సంస్థ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధృవీకరణ సంస్థ, వ్యవసాయ శాఖ ప్రభుత్వ రంగంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రత్యేకించి అంతర్జాతీయ పరిశోధన సంస్థ... ఇక్రిశాట్‌ సైతం హైదరాబాద్‌లో ఉండటం ఓ వరమని చెప్పవచ్చంటున్నారు నిపుణులు.

వరి సాగు ఎంత?

ప్రధాన ఆహార పంట వరి తీసుకుంటే... రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో 3.50 లక్షల ఎకరాల్లో 7 లక్షల టన్నుల విత్తనం ఉత్పత్తి అవుతోంది. అలాగే... హైబ్రీడ్ వరి విత్తనం 1 లక్ష ఎకరాల్లో 70 వేల టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అనుకూలమైన వాతావరణ పరిస్థితుల రీత్యా... దేశంలో 4వ వంతు... అంటే 8,000 టన్నుల వేరుశనగ విత్తనం ఉత్పత్తి ఇక్కడే అవుతోంది. ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే... జోగులాంబ గద్వాల్ జిల్లాలో 40 వేల మంది పత్తి విత్తన రైతులు 30 వేల ఎకరాలు పైగా విస్తీర్ణంలో 12,000 టన్నులు విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఏకంగా రూ.700 కోట్లకు పైగా విలువైన పత్తి ఉత్పత్తి చేసి... 3వ వంతు దేశ పత్తి విత్తనాలు అవసరాలు తీరుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 65 వేల ఎకరాల్లో దేశానికి కావాల్సిన 90 శాతం పశుగ్రాస జొన్నలు 360 టన్నులు, సజ్జలు 140 టన్నుల చొప్పున ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు.

ఆధునిక పోడకలు అందిపుచ్చుకుంటూ..

రాష్ట్రంలో 1500 పైగా గ్రామాల్లో 30 ఏళ్లుగా సాంకేతిక అనుభవం, నైపుణ్యం కలిగిన 3 లక్షల మంది పైగా విత్తన రైతులు విత్తనోత్పత్తిలో(Seed Bowl of India News) నిమగ్నమయ్యారు. సంప్రదాయంగా ఆధునిక పోడకలు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ 7 లక్షలు పైగా ఎకరాల్లో నాణ్యమైన విత్తనోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు అన్నీ కలిసి 12 లక్షల టన్నుల విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే, తెలంగాణ చుట్టు పక్కల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన 12 లక్షల టన్నుల విత్తనాలు హైదరాబాద్‌లోనే ప్రొసెసింగ్, ప్యాకింగ్ చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. మెుత్తంగా దేశానికి 35 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా... తెలంగాణ నుంచే 22 నుంచి 24 లక్షల టన్నులు విత్తనం సరఫరా అవుతోంది.

హైదరాబాద్‌ రికార్డు

భౌగోళికంగా... నైసర్గికంగా విశిష్టత గల హైదరాబాద్‌కు వాయు మార్గం, రోడ్డు మార్గం, రైలు మార్గం ద్వారా రవాణ సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ఇంటర్నేషనల్ సీడ్ లాజిస్టిక్ హబ్‌గా పేరుగాంచింది. హైదరాబాద్‌ చుట్టుపక్కలే దాదాపు దాదాపు 426 జాతీయ, అంతర్జాతీయ, బహుళ జాతి విత్తన కంపెనీలు, ప్రొసెసింగ్ ప్లాంట్లు కొలువుతీరాయి. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకే కాకుండా ఆగ్నేసియా, ఆఫ్రికా దేశాలకు వివిధ పంటల విత్తనాలు ఎగుమతి అవుతుండటం విశేషం. హైదరాబాద్‌లో గంటకు 1000 మెట్రిక్ టన్నుల విత్తన ప్రొసెసింగ్ జరుగుతుంది. ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో ఒక ప్రదేశంలో విత్తన ప్రొసెసింగ్ జరగడం ఇదే అధికం కావడం విశేషం. ఈ పరిశ్రమల ద్వారా 50 వేల మంది నైపుణ్యం గల కార్మికులు, 2 లక్షల మంది నైపుణ్యం లేని కార్మికులు, 50 వేల మంది ఇతర కార్మికులకు విత్తనోత్పత్తి, విత్తన ప్రొసెసింగ్, విత్తన ప్యాకింగ్ రంగాల్లో ఉపాధి లభిస్తోంది.

విదేశాల్లో అధ్యయనం

విత్తనోత్పత్తి క్షేత్రాలు, ప్రొసెసింగ్ మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు జర్మనీ, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ఓ బృందం పర్యటించింది. ఇండో-జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టు ద్వారా జర్మనీ ఆహార, మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు గతేడాది ఇదే సమయంలో ఆ బృందం సందర్శించింది. జర్మనీ, నెదర్లాండ్స్‌ దేశాల్లో విత్తన రంగం అభివృద్ధి, ఆహార శుద్ధి పరిశ్రమ, వ్యవసాయ రంగ పథకాలు, పంటల సాగు విధానాలు, వ్యవసాయ రంగంలో సహకార సంఘాల వ్యవస్థపై అధ్యయనం చేసింది. ఈ పర్యటన నేపత్యంలో తెలంగాణలో ఆయా కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఈ బృందం పలు రకాల సూచించింది.

ఇలా సాధ్యం!

ఇండో-జర్మన్ ప్రాజెక్టు అమల్లో భాగంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం, విత్తన పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన "సీడ్ బౌల్" కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. నాణ్యమైన విత్తనోత్పత్తి పద్ధతులు, అంతర్జాతీయ ఓఈసీడీ విత్తన ధృవీకరణ పద్ధతులు, కోత అనంతరం విత్తన నాణ్యత కాపాడుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలపై విత్తనోత్పత్తిదారులు, విత్తన రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం... తెలంగాణను అంతర్జాతీయ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఎఫ్​ఏవో గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇదే స్ఫూర్తితో.... నాణ్యమైన విత్తనోత్పత్తి, సామర్థ్యం, విత్తన రంగం అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని చెబుతోంది వ్యవసాయ శాఖ.

ఇదీ చదవండి:cm kcr on central government: 'ధాన్యం విషయంలో ఎంతదాకానైనా.. ఎవరితోనైనా పోరాడతాం'

Last Updated : Nov 9, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details