తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉడత ఊపితే' తీగలు తెగుతాయా... విద్యుత్‌ ప్రమాదంపై నిపుణుల సందేహాలు - సత్యసాయి జిల్లాలో ప్రమాదం

సబ్‌స్టేషన్‌లో భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడమే ఏపీ శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం జరిగిన విద్యుత్‌ ప్రమాదానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ తీగలు తెగి రహదారిపై వెళ్తున్న ఆటోపై పడిన ఈ దుర్ఘటనలో.. క్షణాల్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమయ్యారు. సాధారణంగా తీగలు తెగిపడితే వెంటనే ఎర్తింగ్‌ అవుతుంది. వెన్వెంటనే 11 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు వాటంతట అవే పనిచేసి లైన్లకు సరఫరా నిలిచిపోతుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోతుంది. ఏదైనా సాంకేతిక సమస్యతో 11 కేవీ సబ్‌స్టేషన్లలోని బ్రేకర్లు పనిచేయకుంటే.. 33 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు పనిచేయాలి. ఇలా రెండు దశల్లో భద్రతా వ్యవస్థలను డిస్కంలు ఏర్పాటు చేశాయి. తాజా ఘటనలో వీటిలో ఏ ఒక్కటి పనిచేసినా, విద్యుత్‌ సరఫరా ఆగిపోయి కూలీల ప్రాణాలు నిలిచేవి.

'ఉడత ఊపితే' తీగలు తెగుతాయా... విద్యుత్‌ ప్రమాదంపై నిపుణుల సందేహాలు
'ఉడత ఊపితే' తీగలు తెగుతాయా... విద్యుత్‌ ప్రమాదంపై నిపుణుల సందేహాలు

By

Published : Jul 1, 2022, 7:40 AM IST

ఉడత వల్లేనంటే నమ్మశక్యమా?‘విద్యుత్‌ వైర్లపై ఉడత వెళ్లింది. ఈ సమయంలో ఎర్తింగ్‌ అయ్యి, సహజంగా ఏర్పడే ఉష్ణోగ్రతకు వైర్లు తెగిపడ్డాయి..’ ఇదీ దుర్ఘటనపై అధికారులు చెబుతున్న మాట. షాక్‌కు గురైతే ఉడత చనిపోతుంది. చాలాచోట్ల విద్యుత్‌ లైన్లపై కోతులు, పక్షులు పడి చనిపోతుంటాయి. మనుషులూ తీగలకు తగిలి కాలిపోతుంటారు. అలాంటప్పుడు ఉడత కారణంగా ప్రమాదం జరిగిందంటే నమ్మశక్యంగా లేదని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా ప్రమాదం సంభవించింది 11 కేవీ లైన్లలో. సుమారు 12 లీడ్‌ల మెలికతో ఈ వైర్లు ఉంటాయి. వైర్లు తెగిపడానికి ముందు అక్కడ మంటలు వచ్చి ఉండాలి. అలాంటి పరిస్థితి లేదని స్థానికులు చెప్పారు. ఉడత తోక భాగంలోని వెంట్రుకలు కొంచెం కాలినట్లు గుర్తించారు. తీగలు తెగిపడేంత ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఉడత ఎందుకు కాలిపోలేదన్నది ప్రశ్న. వైర్లు తెగేంత మంటలు వచ్చినప్పుడు ఇన్సులేటర్‌ దగ్గర కాలిన ఆనవాళ్లు లేవు. వీటిని బట్టి సాంకేతిక, నిర్వహణ లోపాలే ప్రమాదానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర విద్యుత్‌ తీగ తెగి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు నాగేంద్ర, ఫణీంద్ర మృతిచెందారు. ఇక్కడా తీగలు తెగి పడటానికి కారణం ఏంటన్నది తేల్చాలి.

భద్రతా ప్రమాణాలను విస్మరించడమే..డిస్కంలు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడమే తరచూ ప్రమాదాలకు కారణంగా మారింది. బ్రేకర్లలో సాంకేతిక సమస్యలు వస్తే అవసరమైన విడిభాగాలను డిస్కంలు అందించడం లేదని సమాచారం. పాడైన వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడానికి వీలుగా అదనపు బ్రేకర్లు అందుబాటులో లేవు. 11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి వెళ్లే 3 లైన్లకు వేర్వేరుగా బ్రేకర్లు అమర్చాలి. కొరత కారణంగా కొన్నిచోట్ల ఒకటే అమర్చి గ్రూపింగ్‌ చేస్తున్నారు. విద్యుత్‌ లైన్లను చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ అధికారులు తనిఖీచేసి భద్రతాపరమైన సూచనలు చేస్తుంటారు. వీటి అమలుకు ప్రతి డిస్కం రూ.10 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్‌సీ సూచించినా డిస్కంలు ఆ పని చేయలేదు.

నిర్వహణపై పర్యవేక్షణలేమిఏటా వర్షాకాలానికి ముందు డిస్కంలు లైన్ల నిర్వహణ, మరమ్మతులు చేపడతాయి. కిందికి జారిన తీగలను సరిచేయడం, పాడైన స్తంభాల స్థానంలో కొత్తవి పాతడం, తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడం వంటి పనులు చేస్తారు. ప్రతినెలా లైన్ల నిర్వహణ ప్రక్రియ ఉంటుంది. ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ లోపించిందన్నది ఆరోపణ. విద్యుత్‌ చట్టం ప్రకారం ప్రతి 650 సర్వీసుల పర్యవేక్షణకు ఒక జూనియర్‌ లైన్‌మన్‌ (జేఎల్‌ఎం)ను నియమించాలి. ప్రస్తుతం ఒక్కో జేఎల్‌ఎం ఐదారు వేల కనెక్షన్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో జేఎల్‌ఎం గ్రేడ్‌-2 కింద సిబ్బందిని నియమించినట్లు చెబుతున్నా.. సగం సచివాలయాల్లో లేరు. గృహ విద్యుత్‌ కనెక్షన్లు సుమారు 1.45 కోట్లకు చేరగా, ఆ మేరకు సిబ్బంది లేరు.

ABOUT THE AUTHOR

...view details