Report on Rudakota deaths: ఏపీలోని విశాఖ జిల్లా రూఢకోటలో శిశువుల మరణాలన్నీ ఒకే వీధిలో.. ఒక్క తీరుగానే ఉన్నాయి. శిశువుల కాళ్లు, చేతులు నీలుక్కుపోతుండగానే తల వెనక్కి వాల్చి తుదిశ్వాస విడిచినట్లు నిపుణుల కమిటీ పరిశీలనలో గుర్తించారు. అయితే ఈ మరణాలకు దారితీసిన కారణాలు తెలియాలంటే... మంచి నీటి నాణ్యతను, స్థానికుల ఆహార అలవాట్లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని విచారణ కమిటీలు స్పష్టం చేశాయి. రూఢకోట గ్రామ పరిధిలోని ఒకే వీధిలో శిశు మరణాలన్నీ నమోదవడం చర్చనీయాంశమైంది. 8 మరణాలు శిశువులు జన్మించిన 60 నుంచి 70 రోజుల మధ్య నమోదయ్యాయి.
2018 మే 31 నుంచి డిసెంబరు 15 మధ్య 14 మంది శిశువులు మరణించారు. ఇందులో 8 మరణాలు గత 9 నెలల వ్యవధిలో సంభవించాయి. ఈ మరణాలకు దారితీసిన కారణాలపై వైద్య, ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖ బృందాలు వేర్వేరుగా అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. పాడేరుకు 46 కిలోమీటర్లు, పెదబయలు మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు నివసిస్తున్నారు.