Covid Employment: చేనేత కార్మికుల కష్టానికి ఫలితం లభిస్తున్న తరుణంలో కరోనాతో ఆ రంగం సంక్షోభంలోకి వెళ్లింది. అనేక కుటుంబాల్లో పూటగడవని పరిస్థితి నెలకొంది. ఇటీవలే చేనేత రంగం కోలుకుంటున్న వేళ కొవిడ్ మళ్లీ కలవరపెడుతోంది. అది గమనించిన చేనేత చైతన్య వేదిక నిర్వాహకురాలు తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. హైదరాబాద్ అమీర్‌పేటలో చేనేత సంత ఏర్పాటు చేయించారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. అందమైన చీరలు, వస్త్రాలు, మగ్గంపై అద్భుతంగా నేసిన కర్ణాటక ఇల్క, కోరాపుట్, చందేరి, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, ఇక్కత్..... ఇలా ఎన్నో రకాల చేనేత వస్త్రోత్పత్తులు సంతలో కొలువుదీరాయి.
చేనేత కార్మికుల హర్షం
handloom workers: కరోనా కష్టకాలంలో ఇళ్లకే పరిమితంకాకుండా నగరం తీసుకొచ్చి తమ వస్త్రాలు విక్రయించేందుకు వేదిక కల్పించడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాలు బాగున్నాయని అనేక మందికి ఉపాధి దొరుకుతోందని సంతోషపడుతున్నారు.
సంప్రదాయ ఎంపిక కోసం అందమైన చీరలు, వస్త్రాలు కొలువుతీరాయి. వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు సమీపిస్తుండటంతో వధూవరులకు అవసరమైన అందమైన మిరుమిట్లు కొలిపే కళ్యాణ వస్త్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అద్భుతంగా మగ్గంపై నేసిన గొల్లభామ, నారాయణపేట, ఇక్కత్, మంగళగిరి, కలంకారి, పెన్ కలంకారి, గోదావరి చీరెలు, చీరాల, గద్వాల్, చీరాల చీరలు, గుంటూరు ఖాదీ, చేనేత వస్త్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి యోగా మ్యాట్లు, టవళ్లు, కర్చీఫ్‌లు, ఇకో బంజారా, చేతివృత్తులు సైతం కొనుగోలు చేసేందుకు నగరవాసులు మంచి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.