తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కొనసాగుతున్న కసరత్తు - తెలంగాణ బడ్చెట్​ 2021

ఆదాయ అంచనాలను చేరుకోని పరిస్థితుల్లో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. జనవరి నెలాఖరు వరకు చూస్తే రాష్ట్ర రెవెన్యూ అంచనాలను 52 శాతాన్ని మాత్రమే చేరుకొంది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం అంచనాల్లో 6‌0 శాతానికి లోబడే ఉంది. ఒక్క ఎక్సైజ్ ఆదాయం మాత్రమే 70 శాతాన్ని దాటింది. ఈ ఏడాది అప్పులపై ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. వచ్చే ఏడాది కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పుల అవకాశం, సొంత నిధుల అంచనా ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కొనసాగుతున్న కసరత్తు
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కొనసాగుతున్న కసరత్తు

By

Published : Feb 28, 2021, 8:25 AM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాల్లో ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల ఆధారంగా వచ్చే ఏడాదికి అంచనాలు రూపొందిస్తున్నారు. 2020-21 బడ్జెట్ అంచనాలు చూస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జనవరి నెలాఖరు వరకు 60శాతంలోపే ఉంది. లక్షా రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే కేవలం 60వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఎక్సైజ్‌ పన్ను ఆదాయం మాత్రమే 71 శాతం అంచనాలను అందుకొంది. 16 వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. జనవరి నెలాఖరు వరకు 11 వేల 443 కోట్ల రూపాయలు సర్కార్ ఖజానాకు జమ అయింది.

ఆదాయ మార్గం అంచనా రూ. కోట్లలో

వచ్చిన ఆదాయం

జనవరి నెలాఖరుకు రూ.కోట్లలో

జీఎస్టీ ద్వారా 32,000 20,000
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా 10,000 3,358
అమ్మకపు పన్ను ద్వారా 26,000 16,000
కేంద్రం నుంచి వచ్చేది 10,000 5,870
పన్నేతర ఆదాయం ద్వారా - 2,801
గ్రాంట్ల రూపంలో - 11,764

మొత్తంగా రెవెన్యూ అంచనాలో కేవలం 52 శాతాన్ని మాత్రమే చేరుకొంది. చివరి రెండు నెలల్లో రెవెన్యూ ఏ మేరకు ఉంటుందన్నది చూడాలి.

అప్పులే ఆధారం

ఆదాయాలు భారీగా పడిపోవడం వల్ల ప్రభుత్వం అప్పులపైనే అధికంగా ఆధారపడాల్సి వచ్చింది. 2020-21లో 33 వేల 191 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు పడిపోవడంతో అదనపు అప్పులకు కేంద్రం అనుమతించింది. జనవరి నెలాఖరు వరకే రాష్ట్ర ప్రభుత్వం 43 వేల 937 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. ఫిబ్రవరిలో మరో రూ.రెండు వేల కోట్లు అప్పుగా తీసుకొంది.

సొంత ఆదాయ మార్గాల అన్వేషణ

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కొంతమేర స్పష్టత వచ్చింది. పన్నుల్లో వాటా తగ్గడంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కూడా కొన్నింటికి నిధుల్లో కోత పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐజీఎస్టీ బకాయిలతో పాటు జీఎస్టీ పరిహారం కూడా రాష్ట్రానికి కొంతమేర వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పరిస్థితి ఉండే అవకాశాలు లేవు. అటు రుణపరిమితి కూడా నాలుగు శాతం వరకే అనుమతించారు. దీంతో అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పులపై ఎక్కువగా ఆధారపడేందుకు అవకాశం లేదు. సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కసరత్తు కొనసాగుతోంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కొనసాగుతున్న కసరత్తు

ఇదీ చూడండి:'నికర ఆదాయం పొందడంపై రైతులు దృష్టి సారించాలి'

ABOUT THE AUTHOR

...view details