తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపిక జరగాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న ఏఐసీసీకి రాష్ట్ర సీనియర్ నాయకుల నుంచి అడుగడునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీ ప్రకటన జరగాల్సి ఉండగా మాజీ మంత్రి జానారెడ్డి లేఖతో ఆగింది. అప్పట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చింది. సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ అధ్యక్షుడి ఎంపిక… కార్యవర్గ కూర్పు జరగాల్సి ఉందని ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల వల్ల కొంత ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వంలో తలెత్తిన సమస్యలతో టీపీసీసీ ఎంపిక పూర్తి చేయడంలో అధిష్ఠానం జాప్యం చేసింది.
బలాబలాలపై నివేదిక సిద్ధం
తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. గడిచిన మూడు, నాలుగు రోజులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్, ఏఐసీసీ ఇంఛార్జీలు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్లు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పీసీసీ, కార్యవర్గ కూర్పునకు అభిప్రాయాలు తెలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి కోసం పోటీపడుతున్న వారితోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముఖ్య నేతల అభిప్రాయలనూ నివేదిక తయారు చేసి నివేదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ పదవిని ఆశిస్తున్న వారి జాబితాను రాష్ట్ర ఇంఛార్జీ మాణికం ఠాగూర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి పార్టీతో ఉన్న అనుబంధం, బలాలు, బలహీనతలు అన్ని వివరాలతో కూడిన నివేదిక తయారైనట్లు తెలుస్తోంది.