రాష్ట్రంలోని మత్తు పదార్థాల సరఫరా నిర్మూలనే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పట్టుకున్న పలువురు అధికారులను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి సన్మానించారు. నిన్న ఒక్కరోజే రూ.2 కోట్లు విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను గుర్తించి పోలీసులు సీజ్ చేశారని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అబ్కారీ శాఖ పని చేస్తుందని తెలిపారు. కేవలం నెల రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రమే అధికారుల లక్ష్యమన్నారు. అబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంచి పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. సమాచారం అందించిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రణాళికలను రూపొందించి మత్తు పదార్థాల తయారీ, రవాణా, విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.