Beer Sales Increased in Telangana : రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డును సృష్టిస్తున్నాయి. భానుడు భగభగలకు, వడగాల్పుల నుంచి ఉపశమనం కోసం.. లీటర్లకు లీటర్ల బీర్లను మంచి నీళ్లలా మందుబాబులు తాగేస్తున్నారు. మద్యంతో పోలిస్తే బీరు అమ్మకాలు రెట్టింపునకు మించి జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.2,683.65 కోట్ల విలువైన.. 2.23 కోట్ల లీటర్ల లిక్కర్.. 3.99 కోట్ల లీటర్ల బీర్లు అమ్ముడయ్యాయి.
అంటే రోజుకు 7.43 లక్షల లీటర్ల లిక్కర్.. 13.29 లక్షల లీటర్ల బీర్లను.. మందుబాబులు తాగేస్తున్నట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాల్లో కూడా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు, ఉక్కపోతలతో ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
పెరిగిన లిక్కర్ అమ్మకాలు : మే నెలలో ఎండల తీవ్రత మరింత ముదరడంతో.. అదే స్థాయిలో లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో 20వ తేదీ వరకు జరిగిన మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే.. రూ.1,732.29 కోట్ల విలువైన.. 3.56 కోట్ల లీటర్ల బీర్లు.. 1.37 కోట్ల లీటర్ల లిక్కర్ అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే రోజుకు 17.79 లక్షల లీటర్ల బీర్లు.. 6.84 లక్షల లీటర్ల లిక్కర్ మందుబాబులు తాగేస్తున్నారు.