నయాసాల్ షురూ అవుతున్నందున తెలంగాణలో మద్యం వాడకం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు మద్యం వాడకం అధికం కానుండటం వల్ల ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్... రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మిథనాల్పై నిఘా
ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులను సర్ఫరాజ్ హెచ్చరించారు. మద్యం కల్తీ చేసేందుకు ఉపయోగించే మిథనాల్ తయారీ కేంద్రాలపై గట్టి నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. మిథనాల్ పక్కదారి పట్టి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లయితే అనుకోని ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.