Excise Department Inquiry in SI job Dispute :రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. వాటన్నింటిని చక్కపెట్టే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థలపై దృష్టి పెట్టామని సర్కార్ చెబుతోంది. గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తప్పవని స్పష్టం చేస్తోంది. తాజాగా తెలంగాణ ఆబ్కారీ శాఖలో ఐదేళ్ల క్రితం జరిగిన కారుణ్య నియామకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఇలా నియమించే వారిని జూనియర్ అసిస్టెంట్ లేదా తక్కువ స్థాయి ఉద్యోగానికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి మరణించే నాటికి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మరీ అదే శాఖలో ఎస్సైగా నియమించారు. దీని కోసం అప్పట్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు ఒకరు నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎక్సైజ్‌శాఖ ( Excise Department in Telangana) ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా, ప్రత్యేకంగా వన్ టైం జీవో ద్వారా నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.
పెండింగ్ బిల్లుల కోసం నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి - కేంద్రంపైనే ఆశలన్నీ!
రెగ్యులర్ రిక్రూట్ ఎస్సైగానే పరిగణించాలని జీవో : రెగ్యులర్ రిక్రూట్ ఎస్సైగానే పరిగణించాలని జీవోలో పేర్కొన్నట్లు సమాచారం. సాధారణంగా విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో హతమవడం లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అలా అధికారి హోదాలో కారుణ్య ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఈ నియామక ప్రక్రియను అదే తరహాలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌శాఖలో ఎస్సై కొలువులో చేరిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శాఖాపరమైన శిక్షణ పొందాల్సి ఉంటుంది. కానీ ఈయన శిక్షణ పొందలేదని చెబుతున్నారు.
రెండు సంవత్సరాల క్రితం ఆయన ఇన్‌స్పెక్టర్‌గా సైతం పదోన్నతి పొందడం గమనార్హం. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన నియామక ప్రక్రియ గురించి ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. శిక్షణ తీసుకోలేదనే విషయం విచారణలో తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ఎక్సైజ్‌శాఖ విశ్రాంత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు రివర్షన్ ఇచ్చే అవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు.