Radisson Blu Pub: హైదరాబాద్ రాడిసన్ బ్లూ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్‌కు సెప్టెంబర్ వరకు 24 గంటలు నడుపుకోవడానికి అనుమతి ఉందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు లైసెన్స్ ఫీజు కింద రూ.52,66,700 వసూలు చేయడం... 24 గంటలు బార్ నడుపుకోడానికి అదనంగా మరో రూ.14లక్షలు రాడిసన్ బ్లూ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం చెల్లించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. నాలుగు అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్న హోటల్స్ 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు తమకు సమాచారం ఉందని... పోలీసు శాఖ విచారణలో ఏమి తేలుతుంది? ఆ శాఖ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఎక్కడైన బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాడిసన్ బార్‌కు చెందిన అన్ని కాగితాలను పరిశీలించినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. పత్రాల వరకు అన్ని సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు.