ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం హామీలకే పరిమితమయ్యారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హమీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా హామీలు.. ఇస్తే అమలు చేయాల్సిందేనని న్యాయస్థానాలు చెబుతున్నాయని పొన్నాల గుర్తుచేశారు.
నెల్లికల్లు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని.. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన సీఎం ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. మరోవైపు కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పొన్నాల ఆరోపించారు. ఎస్సీలకు మొదట వెయ్యి కోట్లు ఇస్తానన్న సీఎం.. ఇప్పుడేమో లక్ష కోట్లు అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల భూములని అన్యాయంగా ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.