Konda Visheswar Reddy: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తాజా రాజకీయ పరిణామాలపై సమాలోచనలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరంగల్ రాహుల్ గాంధీ సభకుకాని, పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి కాని హాజరు కాలేదు. ఆయన గత కొన్నిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇవాళ చేవెళ్ల నియోజక వర్గంలో పర్యటిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన ఫామ్ హౌస్‌లోనే కలిశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ తనను కలిసినట్లు వస్తున్నవార్తల్లో వాస్తవం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తటస్థంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌తో పాటు భాజపా నుంచి కూడా తనకు ఆహ్వానం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి న్యూట్రల్‌గా ఉంటున్న విశ్వేశ్వర్ రెడ్డిలు కలువడం విశేషం. తెరాసను ఏ విధంగా ఓడించాలన్నదే లక్ష్యంగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు తాను తటస్థంగా ఉన్నానని ఏదైనా పార్టీలో చేరాలా లేక కొత్త పార్టీ పెట్టాలా అన్న సమాలోచనలు కూడా జరుగుతున్నాయన్నారు. రాబోవు రెండు మూడు నెలల్లో భారీ మార్పులు వస్తాయన్న ఆయన తెలంగాణ కోసం ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే మంచిదని, రెండు రీజినల్ పార్టీలు ఉంటే రాష్టం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయని.. స్థానిక ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు వెంటనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తపార్టీ పెట్టాలంటే రెండు, మూడు వేల కోట్లు రూపాయలు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్నారు. భాజపా నాయకులు ఉన్నప్పటికీ ఓట్లు లేవని.. కాంగ్రెస్‌లో క్యాడర్, ఓట్లు బలంగా ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు.