తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి' - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కర్ఫ్యూతోపాటు ప్రత్యేకమైన ప్రణాళికను ప్రకటించాలని... మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రొ ఎం.కోదండరాం, డా.చుక్కా రామయ్యతో సహా పలువురు నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్​లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్​ కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి నెలకు రూ.7500, 25 కిలోల బియ్యం లేదా గోధుమలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

ex mp konda vishwar reddy, corona diffusion in telangana
'కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి'

By

Published : May 2, 2021, 8:21 AM IST

కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి కేవలం కర్ఫ్యూ విధించితే సరిపోదని, ప్రకృతి విపత్తుల నివారణా చట్టం స్ఫూర్తితో సమగ్రమైన ప్రణాళిక ప్రకటించి, అమలు చేయాలని సీఎం కేసీఆర్​కు... మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొ ఎం.కోదండరాం, డా.చుక్కా రామయ్య, ప్రొ.రమా మెల్కొటే, కే.రామచంద్ర మూర్తి బహిరంగ లేఖ రాశారు.

ప్రభుత్వం సన్నద్ధం కాలేదు

కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉద్ధృతితో రాష్ట్రం అల్లకల్లోలం అవుతోందని, కొవిడ్ నివారణ, చికిత్సలు, ప్రజారక్షణ భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మృతులు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయన్నారు. వాస్తవానికి సెకండ్ వేవ్ రాబోతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉన్నా... సన్నద్ధం కాలేదని ఆరోపించారు.

పరీక్షలు పెంచాలి

ప్రభుత్వ జీవోలు జారీ అయినా కూడా యంత్రాంగం నిర్లిప్తంగా ఉండడం శోచనీయమన్నారు. కొవిడ్ పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని... వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్ష చేసేట్లు ఏర్పాట్లు ఉండాలని డిమాండ్ చేశారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలతోపాటు, కనీసం 70 శాతం ఆర్​టీపీసీఆర్​ పరీక్షలను కూడా చేయాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించాలన్నారు.

నిబంధనలు తప్పనిసరి

గ్రామ స్థాయిలో పోలీయో చుక్కలు అందించినట్టు... కొవిడ్ టీకాలను కూడా అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా టీకాలకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.250 సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకోవాలన్న నిబంధన కచ్చితంగా అమలు అయేటట్టు చూడాలన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వారిని ఆదుకోవాలి

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ధరించిన దానికంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా నియంత్రించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొవిడ్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి ప్రజలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కారణంగా ఆదాయాలు కోల్పోయిన వారికి నెలకు రూ.7500 నగదు, 25 కిలోల బియ్యం లేదా గోధుమలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :కరోనా పరీక్ష ఆలస్యం.. ప్రాణాంతకం!

ABOUT THE AUTHOR

...view details