తెలంగాణ

telangana

ETV Bharat / state

సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదు?: వివేకా కుమార్తె - ఆదినారాయణ రెడ్డి

వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలంటూ ఆయన కుమార్తె సునీత... హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 15 మందిపై అనుమానాలున్నట్లు పిటిషన్​లో​ పేర్కొన్నారు. సిట్ అధికారులు చేస్తున్న దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన సునీత... నెలలు గడుస్తున్నా అసలైన నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 6 కు విచారణను వాయిదా వేసింది.

ex minister viveka daughter questioning cm jagan news
సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదు?: వివేకా కుమార్తె

By

Published : Jan 29, 2020, 8:04 AM IST

సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదు?: వివేకా కుమార్తె

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోరిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి… ముఖ్యమంత్రి అయ్యి.. 8 నెలలైనా ఆ పని ఎందుకు చేయడం లేదనే ప్రశ్నను వివేకా కుమార్తె సునీత లేవనెత్తారు. తన తండ్రి హత్య కేసు విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి ద్వారా ఆమె హైకోర్టులో ఈ మేరకు వాదనలు వినిపించారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులను మార్చడం, కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం లాంటి పరిణామాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ కేసులో అమాయకులను ఇరికించి అసలైన నేరస్థులను వదిలేస్తారేమో అనే సందేహం కలుగుతోందని ఆమె కోర్టుకు నివేదించారు.

సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరమేంటీ?

15 మందిపై తనకు అనుమానాలున్నాయని... అయితే వారిపై నిర్ధిష్ట ఆరోపణలు చేయడం లేదంటూ... వారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, చిన్నాన వైఎస్‌ మనోహర్‌రెడ్డి తదితరుల పేర్లను సునీత ప్రస్తావించారు. కేసు విచారణ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని వ్యాజ్యాల్లో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ... విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

సీబీఐకి అప్పగించాలని..!

వివేకా హత్యకేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు లేదా సీబీఐకి అప్పగించాలని ఆయన భార్య వైఎస్‌ సౌభాగ్యమ్మ, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే అంశంపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా తాజాగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇవికాక వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి మరో వ్యాజ్యం వేశారు. వీటన్నింటిపై జస్టిస్‌ దుర్గాప్రసాదరావు మంగళవారం విచారణ జరిపారు. ప్రతిపక్షనేతగా జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్న చంద్రబాబుకు, తెదేపా కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.

దర్యాప్తు నత్తనడకన సాగుతోంది

వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు జరుగుతున్న తీరు మీద తమకు అనుమానాలున్నాయని ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కోర్టులో పేర్కొన్నారు. 2019 మార్చి15న తన తండ్రి హత్యకు గురయ్యారని... తాము హైదరాబాద్‌ నుంచి పులివెందులకు చేరుకునేసరికి పడక గది, బాత్‌రూంలోని రక్తపు మరకలను శుభ్రం చేశారని చెప్పారు. హత్యకేసుపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ... నాటి డీజీపీ అదే రోజు ఉత్తర్వులు ఇచ్చారని తమ ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తన అన్న వైఎస్‌ జగన్‌... వివేకా హత్య వెనక తెదేపా నేతల హస్తం ఉందని ఆరోపిస్తూ... దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారన్నారు. ఎన్నికల్లో వైకాపా గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 2019 జూన్‌13న సిట్‌ను కొత్త అధికారులతో తిరిగి ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సిట్‌ 13 వందల మందిని విచారించి... కేసులో కొత్త సాక్ష్యాలను సేకరించిందని... కానీ 2019 అక్టోబర్‌లో కడప ఎస్పీగా అన్బురాజన్‌ నియమితులయ్యాక.. దర్యాప్తు నత్తనడకన సాగుతోందని అన్నారు.

సిట్ ఏర్పాటు చేసి ఉండకూడదు

సీబీఐ దర్యాప్తు కోరుతూ... తన తల్లి, అన్న జగన్‌ గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు రెండింటిలో ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్లు దాఖలు చేయలేదని... అలాగే జగన్‌ సీఎం అయ్యి 8 నెలలు అవుతున్నా... సీబీఐ దర్యాపు కోరలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్‌... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్‌ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం.. ఇప్పటికీ డిమాండ్‌ చేస్తున్నట్లుగా భావించాలని తెలిపారు. తమ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సీబీఐ డైరెక్టర్‌, ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సిట్‌ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా ప్రస్తావించారు.

అవినాష్ అధికారులపై ప్రభావం చూపగలరు

తన తండ్రి హత్యకేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డిపై సునీత ప్రధాన ఆరోపణలు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయాక భాస్కర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిపాదించగా వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యతిరేకించారని చెప్పారు. వైఎస్‌ మనోహర్‌రెడ్డిపైనా అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి చనిపోయిన తర్వాత బాత్‌రూం, బెడ్‌రూంలోని రక్తపు మరకలను శుభ్రం చేయమని మనోహర్‌రెడ్డి తనకు చెప్పారంటూ యర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. తాము జైల్లో కలిసినా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డిపైనా ఆరోపణలు చేశారు. ఘటనా స్థలానికి ఉదయం 6 గంటలకే చేరుకున్న మొదటి కుటుంబ సభ్యుడు ... గదులను శుభ్రం చేసేటప్పుడు అక్కడకు సమీపంలో ఉన్నారు. సీఐ శంకర్‌ను రక్షించడానికి అవినాష్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కడప ఎంపీగా అవినాష్‌ అధికారులపై ప్రభావం చూపగలరని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది

ABOUT THE AUTHOR

...view details