రాష్ట్రంలో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, హింసకు తావులేని సంపూర్ణ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. బహుజన అధికారపీఠం కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యలు తెలుసుకుంటానన్నారు. డబ్బు లేకుండా రాజకీయాలతో ప్రజలు ఆనందంగా ఉండే చక్కటి ప్రపంచాన్ని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. బహుజన వర్గాల అభ్యున్నతి ఆలోచన బీఎస్పీలో మినహా ఏ పార్టీలో కనిపించలేదని, అందుకే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యానని వివరించారు. యువత, ప్రజలు డబ్బు, బిర్యానీ, బీరు, చికెన్, చీరలు, ప్రభుత్వాలిచ్చే లక్షల రూపాయల తాత్కాలిక ప్రలోభాలకు తలొగ్గకుండా గొప్ప దార్శనికతతో ఓటు వేసేలా చైతన్యపరుస్తామని పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలో బీఎస్పీలో చేరనున్న ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలు నిజాయితీని గుర్తిస్తారని, ఇప్పటివరకు సమావేశాలకు ఒక్క వాహనాన్నీ పెట్టలేదని తెలిపారు. ప్రజలే సద్దులు కట్టుకుని వస్తున్నారన్నారు. నిజాన్ని నిర్భయంగా, అందరికీ అర్థమయ్యేలా చెప్తానన్నారు. ఇప్పుడు తెలంగాణలో నిజం చెప్పే అవకాశం లేదని, వినే అవకాశాన్ని ప్రజలకూ ఇవ్వడం లేదని ఆక్షేపించారు.
నేను హిందూ వ్యతిరేకిని కాదు. ఇప్పటికీ హిందూమతంలో ఉన్నాను. మా తల్లులు కులదేవతల బోనాలతో మాకు హారతి పడుతున్నారు. నేను హిందూ వ్యతిరేకినని, గురుకులాల్లో మతమార్పిడులు చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. బహుజన చైతన్య లక్ష్యసాధనలో దృష్టిమరల్చేందుకు చేస్తున్న కుట్రలివి. మా చెల్లి పెళ్లిని జోగులాంబ దేవాలయంలో చేశాను. నా పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదు. బహుజనుల మీద జరుగుతున్న ఈ దాడులు కొత్తవేమీ కాదు.
? ఐపీఎస్ అధికారిగా, సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన మీరు... ఆరున్నరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఎందుకు పదవీ విరమణ చేశారు.
ప్రభుత్వ సర్వీసులో ఇంతకన్నా ఎక్కువగా చేయలేం. ఒకవేళ చేయాలనుకున్నా చేయనివ్వరు. విద్య, వైద్యం, ఉపాధిని నిర్లక్ష్యం చేస్తూ, హేతుబద్ధమైన రీతిలో పరిశోధన లేకుండా ప్రజల కష్టార్జితాన్ని పన్నుల రూపంలో తీసుకుని ఇష్టానుసారం ఖర్చుచేస్తుంటే చూడలేకపోయాను. తొమ్మిదేళ్లుగా అరకొర బడ్జెట్ ఇచ్చినా గురుకులాల్లో ఎన్నో సంస్కరణలతో ఎంతో అభివృద్ధి చేశాను. ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బు వృథా చేస్తోంది.. సీఎం ఆలోచనలు, ప్రజాధనాన్ని ఏవిధంగా ఖర్చుపెట్టాలన్న విషయమై విస్తృతమైన చర్చ జరగాల్సింది. నా మనసులో మాట చెప్పాలనుకున్నా వినేవాళ్లు లేరు. సీఎంకు నేరుగా చెప్పాలని ప్రయత్నం చేసినా నాకే కాదు.. ప్రజా ప్రతినిధులకూ ఆ అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మనసులో మాట బయటకు చెప్పలేం. విద్యార్థులకు ఎంతో చేయాలనుకున్నా చేయలేకపోయాను. లోలోపల నిస్పృహ, నిరాశ. అందుకు ఎవరిపైనా కోపం లేదు. ఉద్యోగంలో ఉంటూ ప్రజలకు ఒక్కశాతం సేవ చేశాను. 99 శాతం సేవ చేసేందుకు స్పష్టమైన లక్ష్యంతో బయటకు వచ్చాను.
? భవిష్యత్ రాజకీయ ప్రయాణంలోనూ స్వేరోస్‌తో కలిసే నడుస్తారా..?
స్వేరో ఒక సేవ. ఇది విద్యార్థుల సంస్థ. అథఃపాతాళంలోని బిడ్డలు వినీలాకాశంలోకి వెళ్లి అవకాశాలు అందుకోవాలన్నదే దాని లక్ష్యం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులున్నారు. వారంతా రాజకీయాలకు అతీతంగా స్వతంత్రులుగా ఉండాలి. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడాలి. నేను విలువలకు వ్యతిరేకంగా వెళ్లినా, దారితప్పినా విమర్శించాలి. అవసరమైతే స్వేరోకు దూరంగా పెట్టవచ్చు. అందుకే స్వేరో గౌరవ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశాను. ఉద్యోగులు ఆదాయంలో 5-10 శాతం మానవీయ విలువలకు ఖర్చు చేయాలి. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కృషి చేయాలి.
? బహుజనుల్లో ప్రతి ఒక్కరూ ఒక నెల్సన్ మండేలా, అంబేద్కర్, కాన్షీరాం కావాలని పిలుపునిస్తున్నారు.? దీని అంతరార్థం?
బహుజనుల్లో నాయకత్వ లక్షణాలున్నాయి. ఏళ్లుగా వీరిని ఆధిపత్య వర్గాలు కార్మికులు, కూలీలుగా చూస్తున్నాయి. మేం డబ్బు ఇస్తే కానీ బతకలేరన్న భావనలోకి వారిని తీసుకెళ్లాయి. బహుజనుల్లోనూ నాయకులు ఉన్నారు. వారినీ ఎదగనీయకుండా చేశారు. ఆయా వర్గాల నుంచి అంబేడ్కర్, కాన్షీరాం, మండేలా, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ, బి.పి.మండల్‌లు తయారయ్యేలా చేస్తాం. ఆధిపత్య వర్గాల ప్రలోభాలకు అమ్ముడుపోని కొత్తతరాన్ని రూపొందిస్తాం.
దళితబంధు పథకం విధానపరంగా సరైనది కాదు. ప్రభుత్వం ఖర్చుచేసే రూ.1000 కోట్లతో ఎన్నో గురుకులాలు పెట్టవచ్చు. విశ్వవిద్యాలయం నిర్మించవచ్చు. వైద్య కళాశాలలు ప్రారంభించవచ్చు. సొంత ఆస్తులు అమ్మి, ఫౌండేషన్లు పెట్టి పేద ప్రజలకు సహాయం చేస్తే వాళ్ల కాళ్లు కడుగుతా. ప్రజల కష్టార్జితాన్ని ఎలాంటి హేతు బద్ధమైన సర్వేలు, పరిశోధనలు, నైపుణ్యాల కల్పన లేకుండా మొండిగా ఖర్చుచేయడం చాలా ప్రమాదకరం.
? ప్రతి ప్రసంగంలో చట్టం పరిధి దాటొద్దని చెప్తున్నారు. ఈ హెచ్చరికలు మీ పోలీసు నేపథ్యం నుంచి వస్తున్నవా?
బహుజనులు శాంతిపరులు. ఆధిపత్యవర్గాలు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేలా చేస్తాయి. ఈ కవ్వింపుచర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. శాంతియుతంగా మెలగాలని పోలీసు అధికారిగా నా అనుభవం మేరకు చెబుతున్నాను. ఇటీవల క్షేత్రస్థాయిలో తిరుగుతున్నపుడు ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నావని నాతో పనిచేసిన పోలీసులు అడుగుతున్నారు. చెప్పకపోతే అరెస్టు చేస్తామంటున్నారు.నా వివరాలు ఇతరులకు ఇవ్వాలని ఏ చట్టం చెబుతోంది? నన్ను అడగడమే కాదు..నన్ను కలుస్తున్న వారినీ ప్రశ్నిస్తున్నారు. బీఎస్పీ, స్వేరోస్ నిషేధిత సంస్థలు కాదు కదా? ప్రభుత్వం ఎందుకు మా నీడను చూసి భయపడుతోంది? ఇవన్నీ పోలీసులు చేస్తున్నవి కాదు. పేదల ప్రజల గొంతుకను ఓర్వలేని ఆధిపత్య వర్గాలు చేస్తున్న కుట్రలివి. మా ప్రయత్నాలను శాంతియుతంగానే కొనసాగిస్తాం.