Ex Deputy Speaker Harishwar Reddy Passes Away :పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండె పోటుతో హఠాన్మరణం పొందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హరీశ్వర్ రెడ్డి.. పరిగిలోని తన నివాసంలో గుండెపోటు(Heart Attack) రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు సీపీఆర్(CPR) చేసినా స్పందించకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు చలనం లేకపోవడంతో.. మృతి చెందినట్లు నిర్ధారించారు.
CM KCR Condolence on Koppula Harishwar Reddy Demise : కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరణంతో.. కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం వారి నివాసానికి తీసుకువచ్చారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పరిగి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానాన్ని పొందిన సీనియర్ రాజకీయ నేతగా.. ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత.. రాహుల్, సోనియా నివాళి
Ex MLA Koppula Harishwar Reddy Passed Away :మరోవైపు మాజీ ఉపసభాపతి హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే ప్రస్తుత శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్, మిగిలిన మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.