Electronic Voting Machine History : ఓటరు మహాశయులందరికీ నమస్కారం.. నా పేరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) (Electronic Voting Machine). ప్రజాస్వామ్యంలో నేను ఎంతో కీలకం. గతంలో మీరు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేసేవారు. ఇప్పుడు మీరు రహస్యంగా వేసే ఓటుకు కాపలాదారు అయ్యాను. 42 సంవత్సరాల కిందటే తొలిసారి వచ్చాను. అప్పట్లో నాలో తలెత్తిన సాంకేతిక సమస్యలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలోనే అన్ని అడ్డంకులను అధిగమించి.. ఆధునికతను సంతరించుకుని ఇప్పుడు మీ గుండె చప్పుడయ్యాను. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలప్పుడు, మధ్యమధ్యలో ఉపఎన్నిక వచ్చినా మీ ముందుకు వస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపిస్తున్నాను. మీ ఓటును రహస్యంగా నాలో దాచుకుంటా.. మీరు మెచ్చిన నాయకులను చట్టసభలకు పంపుతున్నాను.
నా గురించి నాలుగు మాటలు ..
- 1982లో నా ప్రస్థానం మొదలైంది. కేరళ రాష్ట్రంలోని పరూర్ అసెంబ్లీ స్థానానికి మే 19న జరిగిన ఎన్నికల్లో తొలిసారి నన్ను వినియోగించారు.
- 1982-83లో దేశ వ్యాప్తంగా పది స్థానాల్లో నిర్వహించిన ఉపఎన్నికల్లో నేనే వారధిగా ఉన్నా
- 1984లో నాపై కొందరు నిందలు మోపడంతో మార్చి 5న ఎన్నికల్లో నా వాడకం తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
- కేంద్ర ప్రభుత్వం 1988 డిసెంబర్లో.. సెక్షన్ 61-ఏ ద్వారా చట్టంలో చేర్చి నాలో తిరిగి చలనం తీసుకువచ్చింది.
- 1989 మార్చి 15న సుప్రీంకోర్టు నాకు బాసటగా నిలిచి.. సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
- ఎన్నికల సంస్కరణ కమిటీ ఆదేశాల మేరకు 1990 జనవరిలో.. సాంకేతిక నిపుణుల కమిటీ ఎన్నికల్లో నన్ను వినియోగించుకోమని సిఫారసు చేసింది.
- మార్చి 24న 1992న పలు సవరణలతో.. ఎన్నికల నియామావళి 1981లో ప్రభుత్వం అధీకృతం చేసింది.
- 1998లో ప్రజామోదం లభించింది.
- 1999 నుంచి 2018 మధ్య కాలంలో చట్ట సభలకు జరిగిన ఎన్నికల్లో నా సేవలను వినియోగించుకున్నారు.
నాకు గర్వకారణం : నేను నాయకుల తలరాతలు మారుస్తాను. బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేస్తాను. దేశాన్ని పరిపాలించే ప్రధాని నుంచి రాష్ట్రాలను నడిపించే సీఎంలు, పాలకుల భవిత నాలోనే నిక్షిప్తం అవుతుంది. ఇంతటి శక్తి మరెవరికీ లేదని అనుకుంటాను. ఒకింత నాకిది గర్వకారణ. మరింత మురిపెం కూడా.
ఎన్నికల నిర్వహణలో సవాళ్లు - కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ నజర్
16 మీటలతో మీ ముందుకు : నాలో మొత్తం రెండు యూనిట్లు ఉంటాయి. మొదటిది కంట్రోల్ యూనిట్ కాగా రెండోది బ్యాలెటింగ్ యూనిట్ అని అంటారు. మీ కళ్లకు కనిపించే బ్యాలెట్ యూనిట్‌లో నోటాతో కలిపి 16 మీటలుంటాయి. వీటిల్లో 15 మీటలు నాయకుల భవితను నిర్ణయిస్తాయి. మీకు ఇష్టం లేని నేతలు ఏవరైనా పోటీలో ఉన్నప్పుడు నోటా మీట ప్రెస్ చేయండి. ఓటింగ్ పూర్తయిన అనంతరం.. అధికారులు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి ఒక చోట భద్రంగా ఉంచుతారు. అక్కడ నేనుండే చోటును స్ట్రాంగ్ రూమ్ అని అంటారు. లెక్కింపు పూర్తయ్యేదాక నన్ను కంటికి రెప్పలా కాపాడుతారు. లెక్కింపు రోజు నేను అందరినీ కలవరానికి గురిచేస్తాను. నెమ్మదిగా ఒక్కొక్కరి భవిత బయటకు తీసుకొస్తాను.
నాకు చేదోడుగా మరొకరు :ఓటమి చెందినవారు నాపై నిందలు మోపడం పరిపాటిగా మారింది. మీరే గుర్తుపై మీట నొక్కితే.. నేను ఆ అభ్యర్థికే ఓటు పడేటట్లు చేస్తాను. నా విధి నిర్వహణలో నేను ఏనాడూ పొరపాటు చేయలేదు. అయినప్పటికీ నిజనిర్ధారణ కోసమని అన్నట్లు.. నాకు సహాయంగా మరొకరు ఉంటారు. అతని పేరు వీవీ ప్యాట్(VVPAT). మీరుఇక్కడ ఎవరికి ఓటేశారో చూసుకోవచ్చు మరి.