మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాలపై ఆరోపణలు, అనుమానాలకు వివరణ ఇస్తూ.. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కౌంటరు దాఖలు చేసింది. చట్టాన్ని, నిబంధనలను పక్కన పెట్టి హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కౌంటరు దాఖలు చేశారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను 109 రోజుల నుంచి 8 రోజులకు కుదించలేదని తెలిపారు. ఎనిమిది రోజుల్లో కేవలం వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. రాష్ట్రమంతటా ఒకే విధంగా వార్డుల విభజన ప్రక్రియ జరిగేందుకు వీలుగా జీవో 459 జారీ చేసినట్లు కౌంటరులో సర్కారు తెలిపింది.
1373 అభ్యంతరాలు...
అభ్యంతరాల ప్రక్రియ కూడా చట్ట ప్రకారమే నిర్వహించినట్లు తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసు బోర్డులు, పత్రికల ద్వారా ప్రకటనలు జారీ చేశామని.. ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీ కౌన్సిళ్లకు అభిప్రాయాలు తీసుకున్నట్లు వివరించారు. విస్తృతంగా ప్రచారం జరిగింది కాబట్టే.. 1373 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలన్నీ 24 గంటల్లో పరిష్కరించలేదని... ఐదు రోజుల పాటు ప్రక్రియ జరిగిందన్నారు.