ముఖానికి తొడిగే మాస్కు నుంచి కారులో ఇద్దరికి మించి ప్రయాణించే వరకు అనేక రకాల రూల్స్ కరోనా కాలంలో అమల్లోకి వచ్చాయి. వీటిపై అవగాహన కలిగి ఉండడం వ్యక్తిగతంగానే కాదు, సమాజానికి కూడా శ్రేయస్కరం. ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టంతోపాటు ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.
మాస్కు ధరించకపోయినా..
రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకొంది. బయటకెళ్లే వారు తప్పకుండా ముఖానికి మాస్కు వేసుకోవాలని నిబంధన పెట్టింది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ పోలీసులు ఇప్పటి వరకు ఎవరైనా మాస్కు ధరించకుండా కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై మాస్కు లేకుండా బయటకొస్తే పోలీసులు చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవచ్ఛు జరిమానా కూడా విధిస్తారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని ఓ గ్రామంలో మాస్కు ధరించకుండా చికెన్ అమ్ముతున్న వ్యక్తికి రూ. 500 జరిమానా విధించారు.
రహదారులపై ఉమ్మి వేస్తే..
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతున్న కారణంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. గుట్కాలు, పాన్‌లు తిని ఉమ్మేయడం, బయట నోరు కడుక్కోవడం లాంటివిప్పుడు నేరం కింద పరిగణిస్తారు. ఇప్పటికే వరంగల్ రూరల్ జిల్లా పోలీసులు ఒక వ్యక్తి ఉమ్మివేసినందుకు కేసు నమోదు చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలోని ఉమ్మి తొట్టెలు ఏర్పాటు చేశారు.