తెలంగాణ

telangana

ETV Bharat / state

Inter Evaluation Process: ఆన్‌లైన్‌లో ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం

Inter Evaluation Process: ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈసారి ఆన్​లైన్​లో ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డ్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అనుమతి కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

Inter
Inter

By

Published : Mar 18, 2022, 5:36 AM IST

Inter Evaluation Process: ఆన్‌లైన్‌లో ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ప్రయోగాత్మకంగా ఈసారి నుంచి ప్రారంభించేందుకు ఇంటర్‌ బోర్డు సిద్ధంగా ఉంది. అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. కరోనా కంటే ముందు దేశవ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాలు కంప్యూటర్‌లో జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాయి. ఇంటర్‌బోర్డు కూడా అప్పట్లో ప్రయత్నించగా ప్రభుత్వం ఆమోదించలేదు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో 2020 మార్చిలో ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబుపత్రాల మూల్యాంకనం కష్టమైంది. ఫలితాల ప్రకటన జాప్యమైంది. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ మూల్యాంకనం దిశగా వెళ్లాలని బోర్డు ప్రయత్నిస్తోంది.

ఈసారి ప్రయోగాత్మకంగా ఒకేషనల్‌లో రెండు సబ్జెక్టులు లేదా కామర్స్‌ లాంటి తక్కువ జవాబు పత్రాలుండే సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపడతామని బోర్డు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చారు. ఏపీలో గత ఏడాది ఒకేషనల్‌ సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ మూల్యాంకన విధానాన్ని అమలు చేశారు. ఆయా జవాబు పత్రాలను జిల్లాల వారీగా స్కానింగ్‌ చేసి సబ్జెక్టుల వారీగా అధ్యాపకులకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. వారు ఇంట్లో నుంచే తమ కంప్యూటర్‌లో కరెక్షన్‌ చేసి మార్కులు వేస్తారు. తర్వాత మరో అధ్యాపకుడి పరిశీలనకు పంపిస్తారు. మొదట్లో ఈ విధానానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అన్ని పేపర్లను స్కానింగ్‌ చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయాలి లేదా ఏదైనా ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాలి. అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రయోజనాలు

* అధ్యాపకులు వేసిన మార్కుల మొత్తం కూడికలో తప్పులు దొర్లవు... ఒక పేజీని పూర్తిగా దిద్దకుండా ఉండటం లాంటి సమస్యలుండవు. సాఫ్ట్‌వేర్‌ ద్వారా అలాంటి పొరపాట్లు దొర్లకుండా ఉంటాయి.
* అధ్యాపకులు స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉండదు.
* ఎవరు.. ఏ పేపరు దిద్దారో తెలిసిపోతుంది. ఏదైనా పొరపాటు జరిగితే క్షణాల్లో ఆ జవాబుపత్రాన్ని బయటకు తీసి పరిశీలించవచ్చు.
* ఒక్కో పేపర్‌ను ఎంత సమయంలో దిద్దాలో నిర్దేశించుకోవచ్చు. అంటే ఒక గంటలో అన్ని పేపర్లను తూతూమంత్రంగా దిద్ది పక్కన పడేయడం కుదరదు.
* ఫలితాలిచ్చిన రోజే విద్యార్థులు తమ జవాబుపత్రాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్పుడు తమకు అన్యాయం జరిగిన సబ్జెక్టు పునఃపరిశీలనకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత విధానంలో రూ.600 చెల్లిస్తేనే ఆ జవాబుపత్రం విద్యార్థికి అందుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


ABOUT THE AUTHOR

...view details