Special Story on Etv Cameraman Omprakash : తెలుగు టెలివిజన్ చరిత్రలో ఈటీవీకి ఉన్న స్థానం ప్రత్యేకం. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద కార్యక్రమాలను రూపొందిస్తూ ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఉత్తమమైన ధారావాహికలను అందిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. అయితే ఈ ధారావాహికల వెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల్లో ఒకరైన ఓంప్రకాశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు టెలివిజన్ ధారావాహికల్లో ఎవరూ సాహసించని పనిచేసి అందరిచేత ప్రశంసలందుకున్నారు. ఆయన పనితీరును మెచ్చిన ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ తమ రికార్డుల్లో ఓంప్రకాశ్‌కు చోటు కల్పించింది.
ETV cameraman Om Prakash got a Place Indian Book of Records : ఈటీవీలో ప్రసారమయ్యే మనసంతా నువ్వే ధారావాహికకు ఓంప్రకాశ్.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తున్నారు. మలినేని రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ ధారావాహిక విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో సరికొత్తగా ఎపిసోడ్స్‌ను చూపించాలని ఆలోచన చేశాడు ఓంప్రకాశ్. తన ఆలోచనకు ఛానల్ యాజమాన్యం, దర్శకుడు అంగీకారం తెలిపారు. మనసంతా నువ్వే 331వ ఎపిసోడ్‌ను సింగిల్ షాట్‌లో పూర్తి చేశారు. 21 నిమిషాలపాటు ఎక్కడా ఎలాంటి కట్స్, జర్క్ లేకుండా ఆరుగురు నటీనటుల హావభావాలు, భావోద్వేగాలను తన కెమెరాతో ఒడిసిపట్టి శభాష్ అనిపించుకున్నారు.
గతంలో పుత్తడిబొమ్మ ధారావాహికకు ఇలాగే 26 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో ఎపిసోడ్ మొత్తం చిత్రీకరించారు. అప్పుడు కూడా పేరుతోపాటు నంది అవార్డు అందుకున్నారు. అలాగే ఈసారి కూడా మనసంతా నువ్వే ధారావాహికకు చేసిన పనిని అవార్డుకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఓంప్రకాశ్ కుమారుడి సహాయంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. 4 నెలలపాటు ఓంప్రకాశ్ చేసిన సింగిల్ టేక్ షాట్‌ను పరిశీలించిన ఆ సంస్థ.. ఓంప్రకాశ్ పేరును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసింది.