గవర్నర్ పదవిని ప్రజలకు సేవచేసే అవకాశంగా భావిస్తానని రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. గవర్నర్‌గా అవకాశం కల్పించిన పార్టీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా అధ్యయనం చేసి పరిష్కారం దిశగా కృషి చేస్తానంటున్న తమిళసైతో... ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి...
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం పట్ల మీ స్పందన?
గవర్నర్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉంది. దీన్ని ఓ హోదాలా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్నిచ్చిన ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాధారణ కార్యకర్తగా చేరిన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థానం నుంచి గవర్నర్‌గా వెళ్తున్నారు, ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసం ఎలా చూస్తారు?
పార్టీ అధ్యక్షురాలి పదవి రాజకీయానికి సంబంధించింది. కానీ గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైన హోదా. గవర్నర్‌గా నేను రాజకీయాల్లో పాల్గొనేందుకు కొన్ని పరిధులుంటాయి. ఏదేమైనా గవర్నర్ హోదాను ప్రజలకు సేవ చేసే మరో వేదికగా నేను భావిస్తున్నా.
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వాటిలో ఒకదానికి మీరు గవర్నర్‌గా వెళ్తున్నారు. దీని గురించి మీరేం చెబుతారు?
తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. రాజ్యాంగ పరిధిలో రాష్ట్ర అభివృద్ధి కోసం నేను చేయగలిగింది చేస్తా. నా కార్యక్రమాలు, సేవలు నేరుగా ప్రజలకే అందుతాయి.
సొంత రాష్ట్రానికి దూరమవుతున్న భావన లేదా?
అవును, దూరమైన భావన ఉంటుంది. నేను రెండు పర్యాయాలు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేశాను. కానీ మరో ఉన్నత హోదాలో మరో రాష్ట్రానికి సేవ చేసే అవకాశం లభించింది. సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉంటాను కాబట్టి పెద్దగా దూరమైన భావన ఉండదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పరిష్కారం కాని సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో గవర్నర్‌గా మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
మొదట నేను ఆ సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉంది. కొంత సమయం తీసుకుని సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నాక వాటి గురించి ఆలోచిస్తా.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మీ వైఖరి ఎలా ఉంటుంది?
నేను సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తిని. కచ్చితంగా కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉంటాయనే భావిస్తున్నా. ఇప్పటికే ఆయన నాకు అభినందనలు తెలిపారు. తప్పకుండా సానుకూలంగానే ఉండబోతోంది.
నూతన గవర్నర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి ఇదీ చూడండి: కరువు కాటేసింది... కాలం ఆ రైతును కాడెద్దును చేసింది!