అది ఒక పాఠశాల.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్ విల్లే నగరంలో ఉంది. దాని పేరు లింకన్ పార్క్. సహజంగా ఏ స్కూల్లోనుంచైనా విద్యార్థులు, టీచర్ల అలికిడి వినిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం.. పసికందుల ఏడుపులు కూడా వినిపిస్తాయి. ఒకటీ రెండు కాదు.. చాలా గొంతులు గోల చేస్తాయి. ఎందుకంటే.. ఆ తరగతి గదిలో విద్యార్థులు మాత్రమే కాదు.. వారు కన్న పిల్లలు కూడా ఉంటారు! అలాగని వారంతా డబుల్ పీజీలు చదువుతున్న విద్యార్థులు కాదు. పీహెచ్డీ చేస్తున్నవారు అంతకన్నా కాదు. జస్ట్.. టెన్త్ స్డాండర్డ్ కూడా దాటనివారే! "ఏంటిదంతా.." అంటున్నారా..? చాలా మంది అమెరికన్లు కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు! స్వేచ్ఛ గురించి పైన చెప్పుకున్న ప్రశ్నలు వీళ్లు కూడా సంధిస్తున్నారు.
"అమెరికాలో కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది.. కానీ ఫ్రీగా ఏదీ దొరకదు" ఇది ఓ సినిమా డైలాగ్. ఇప్పుడు హద్దుల్లేని ఆ ఫ్రీడమే కొంప ముంచుతోందా? అనే చర్చ మొదలైంది ఆ దేశంలో. పెరిగిపోతున్న టీనేజ్ గర్భాలపై కొంత కాలంగా యూఎస్‌లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితికి సజీవ సాక్ష్యమే టెక్సాస్ రాష్ట్రంలోని పాఠశాల. సెకండరీ స్థాయి ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయకుండానే గర్భం దాల్చి.. బిడ్డలకు జన్మనిచ్చిన టీనేజర్ల జీవితం గమ్యంలేని ప్రయాణం కాకుండా చూసేందుకు ఈ పాఠశాల ప్రయత్నిస్తోంది.
గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీనేజ్ గర్భవతులు విపరీతంగా పెరిగిపోయారు. ఇలాంటి వారికి 2005 నుండి సేవలందిస్తోంది లింకన్ పార్క్ స్కూల్. ఇందులో ఉన్న విద్యార్థులంతా 14 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నవారే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. 15 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ప్రతీ వెయ్యి మంది యువతులలో.. 15 శాతం మంది 2020 సంవత్సరంలో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీన్ని బట్టి టీనేజ్‌లో గర్భధారణ అన్నది ఎంత సాధారణం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారి సమాచారం కలపలేదు. అవి కూడా చేర్చితే టీనేజ్ గర్భవతుల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. బ్రౌన్స్‌విల్లే నగరంలో ప్రతీ 10 టీనేజర్లలో ఒకరు బిడ్డకు జన్మనిచ్చారని లెక్కలు చెబుతున్నాయి.
ఇలాంటి అమ్మాయిల భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చిన్నతనంలోనే గర్భం దాల్చిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకసారి తల్లైన మహిళ.. గతంలో మాదిరి పటుత్వాన్ని తిరిగి పొందడం దాదాపుగా అసాధ్యం అంటారు నిపుణులు. అలాంటప్పుడు తమ శరీరమే పూర్తిగా ఎదగని వారు మరో బిడ్డకు జన్మనిస్తే దీర్ఘ కాలంలో ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.