తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔషధ మొక్కలపై వైద్యులకే పాఠాలు చెబుతోంది! - plants latest news

అడవిలో అడుగుపెడితే.. ఏ మొక్క గొప్పతనం ఏంటో పొల్లుపోకుండా చెప్పేంత నేర్పరి!  వంశపారంపర్యంగా అందిన ఔషధమొక్కల రహస్యాలను, ప్రకృతి వైద్యవిద్యను తోటిమహిళలకు నేర్పిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మహిళలను ఉపాధి బాటపట్టిస్తోంది. అరోవిలే సంస్థలో హెర్బలిస్ట్‌గా పనిచేస్తూ వేలాదిమందికి ఔషధమొక్కలపై అవగాహన కలిగిస్తోంది పార్వతీ నాగరాజ్‌...

etv bharat special story on Parvati Nagaraj
ఔషధ మొక్కలపై వైద్యులకే పాఠాలు చెబుతోంది!

By

Published : Oct 25, 2020, 1:14 PM IST

‘అమ్మాయిలకు చదువెందుకు? పొలం పనులు చేసుకుని, ఉన్న నాలుగు పశువులు చూసుకుంటే చాలదా!’ అనే తీరు నల్లూరు గ్రామప్రజలది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉందీ గ్రామం. పార్వతి కుటుంబం కూడా ఆ ఊరి ఆలోచనలకు మినహాయింపేమీ కాదు. ఆరుగురు సంతానంలో పార్వతి రెండోది. ఐదో తరగతి వరకూ అయితే ఒప్పుకున్నారు కానీ... ఆపై చదవడానికి ఇంట్లో ఒప్పుకోలేదు. ‘అలా అయితే అన్నం తినను’ అని మొండికేసింది పార్వతి. చివరకు ఒప్పుకున్నారు. కానీ అసలు కష్టం అక్కడే వచ్చింది ఆమెకు. రోజూ బడికోసం 12 కి.మీ నడవాలి. ఫీజులు కట్టడానికి ఇంట్లో డబ్బులిచ్చేవారు కాదు. దాంతో కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బునే దాచి ఫీజులు కట్టేది పార్వతి. అలా కష్టపడి చదువుతూ ఇంటర్‌ పూర్తిచేసింది. తర్వాత ఓ ప్రైవేటు స్కూల్లో పాఠాలు చెబుతూ దూరవిద్యలో బీఏ, ఎంఏ. చేసింది. కానీ బడిలో నేర్చిన పాఠాలకంటే అడవి నేర్పిన పాఠాలే అండగా నిలిచి ఆమె కెరీర్‌ని తీర్చిదిద్దాయి.

నానమ్మ చెప్పిన పాఠాలే...

పార్వతి చిన్నపుడు అరుదైన చర్మవ్యాధికి గురైంది. దానికి వాళ్ల నానమ్మే వైద్యం చేసేది. ఆ మొండివ్యాధి నయమవ్వడానికి సుమారు ఐదేళ్లు పట్టింది. ఆ సమయంలో దగ్గర్లోని అడవికి వెళ్లేటప్పుడు పార్వతిని కూడా తీసుకువెళ్లేది వాళ్ల నానమ్మ. ఆమె మొక్కలూ, ఆకులూ, కాండాలూ, విత్తనాలు సేకరిస్తూ .. వాటి గొప్పదనం గురించి పార్వతికి చెప్పేది. కొన్ని రోజుల తర్వాత పార్వతిని మాత్రమే అడవికి పంపి ఫలానా మూలికలు తీసుకురమ్మని చెప్పేది. అప్పుడు కానీ అడవి రహస్యాలు అర్థం కాలేదు పార్వతికి. ‘మా ఊళ్లో చాలామంది నానమ్మ దగ్గరకు వైద్యానికి వచ్చేవారు. కొందరు స్త్రీలు పనులకోసం నీళ్లలో నానడంతో కాళ్లకీ, చేతులకీ ఇన్‌ఫెక్షన్లు వచ్చేవి. మరికొందరికయితే కుండలతో నీళ్లు మోసీమోసీ నడుం దగ్గర పుండ్లు పడేవి. వీటన్నింటినీ నానమ్మ తనకు తెలిసిన మూలిక వైద్యంతో తేలిగ్గా పరిష్కరించేది. మూలికల్ని ఎవరూ చూడకుండా తీసుకురమ్మనేది నన్ను. ఎవరైనా చూస్తే వైద్యం ఫలించదనేది. మన పెద్దవాళ్లు మూలికావైద్యాన్ని రహస్యంగానే ఉంచేవారు. నానమ్మ చనిపోయాక ఆ పారంపర్యం అమ్మకు వచ్చింది. అమ్మ కూడా అంతే తనకు తెలిసిన మూలికలు, వేర్ల గురించి నాక్కూడా చెప్పేదికాదు. కానీ నేను మాత్రం నేర్చుకున్న వాటిని ప్రపంచానికి చెప్పాలనుకున్నా’ అని అంటోంది పార్వతి.

అరోవిలే నుంచి పిలుపు...

తమిళనాడులోని అరోవిలే సంఘం పార్వతి కుటుంబంపైన ఒక డాక్యుమెంటరీని తీసింది. అందుకు కారణం.. అరోవిలే సంస్థ ‘పిచ్చాండికులం ఫారెస్ట్‌’ పేరుతో వనమూలికల అభివృద్ధిని పెద్దఎత్తున చేపట్టింది. వందల ఎకరాల్లో ఔషధమొక్కలని పెంచడం ప్రారంభించింది. అదే సమయంలో పల్లెల్లో ఉండే సంప్రదాయ వైద్య విధానాలపై ఓ డాక్యుమెంటరీని తీసింది. పార్వతి కుటుంబంలో నాయనమ్మ, నాన్న, తల్లి అందరూ మూలికావైద్యంపైన అవగాహన ఉన్నవాళ్లే కావడంతో వారి గురించి ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. అప్పటికే పార్వతికూడా పెరట్లో ఔషధమొక్కలని పెంచుతూ వాటితో కేశాలకు నూనెల్నీ, వ్యాధులకు మందుల్నీ తయారుచేసేది. అది చూసిన అరోవిలే సంస్థ తాము నిర్వహించే పీహెచ్‌సీలో వైద్యసిబ్బందికి వనమూలికలపై శిక్షణ ఇచ్చే బాధ్యతను పార్వతికి అప్పగించింది. అక్కడ నుంచి పార్వతి హెర్బలిస్ట్‌గా తన కెరీర్‌ని మలుపు తిప్పుకొంది. పిచ్చాండికులం అడవిలోని ఔషధ మొక్కలు, వాటిని ఉపయోగించే విధానాలపై నర్సులు, వైద్యులకు శిక్షణనిచ్చేది. ఆ అడవిలో ఉన్న దుంప రాక్షసం, తొగరు, ఉప్పాకు, వామాకు, బొంత జెముడు, సన్న జెముడు, పిప్పళ్లు... ఇలా 800 రకాల ఔషద మొక్కల గురించిన పాఠాలు ఆమె అనర్గళంగా చెప్పేది. ఎన్నో ఏళ్లు రహస్యంగా ఉండిపోయిన మూలికా విలువల గురించి ఆసక్తి ఉన్నవారికి వివరించడంతోపాటూ వాటిని పుస్తకాల్లో రికార్డు చేయడం మొదలుపెట్టింది. అందం, ఆరోగ్యం కోసం మూలికలని ఎలా ఉపయోగించుకోవచ్చో.. సౌందర్య ఉత్పత్తులను ఎలా తయారుచేయొచ్చో స్థానిక గిరిజనులకు శిక్షణనిచ్చి స్వయం ఉపాధి బాట పట్టేలా చేసింది. ఈ వర్క్‌షాపులకు స్థానికులతోపాటు విదేశీయలూ హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతారు. వీటితోపాటూ ఆయా సీజన్లలో దొరికే పండ్లతో ఆరోగ్యకరమైన పద్ధతుల్లో సిరప్‌, జామ్‌ తయారీపైనా అవగాహన కల్పిస్తోంది. అలాగే రసాయనాలు లేకుండా పండ్ల నుంచి లిప్‌బామ్‌లు, కలబంద నుంచి కాటుక, ఆకులతో హెయిర్‌ డై వంటివాటి తయారీనీ నేర్పుతోంది. ఇప్పటివరకు ఆరువేలమంది మహిళలు పార్వతి ద్వారా లబ్ధి పొందారు.

పోషక విలువల గురించీ...

‘ఆహారమే మందు- ఆహారమే అందం’ పేరుతో పోషకాహారంపై దేశవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది పార్వతి. తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ వర్క్‌షాపులు నడుస్తున్నాయి. అలాగే రైతులకు తమ చుట్టుపక్కల ఔషధమూలికలను గుర్తించడం, వాటి పెంపకంపై అవగాహన కలిగిస్తోంది. ఈమె సేవలకు గానూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘ఇండియా బయో డైవర్సిటీ’ అవార్డు సహా ఇంకెన్నో అవార్డులను అందుకుంది అంతకుమించి రహస్యంగా ఉన్న మూలికావైద్యాన్ని వెలుగులోకి తెచ్చి ఎందరినుంచో ప్రశంసలూ అందుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details