తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణ రక్షణకు పదో తరగతి విద్యార్థిని ముందడుగు.. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తూ..!

దేశవ్యాప్తంగా కాలుష్యం సమస్త జీవకోటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కోరలు చాచిన కాలుష్య కారకం నుంచి పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా ఓ విద్యార్థిని ముందడుగు వేస్తోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తూ.. నిత్యం ఉపయోగపడే చాపలు తయారు చేయించి పేదవారికి పంపిణీ చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన అలటి మహతిరెడ్డి.

Alati Mahati Reddy
Alati Mahati Reddy

By

Published : Dec 31, 2022, 9:16 PM IST

ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించిన పదో తరగతి విద్యార్థిని

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన అలటి వెంకటేశ్​రెడ్డి, రమ్యారెడ్డి దంపతుల కుమార్తె మహతి రెడ్డి. ఈ పదిహేనేళ్ల అమ్మాయి గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ప్రాణాంతకంగా మారిన కాలుష్యాన్ని తగ్గించి.. పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేయాలని భావించి ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమి, నీటిలో కలవకుండా చూడాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేయించి ఔరంగాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ చాపలు తయారు చేయించి వాటిని పేదప్రజలకు పంపిణీ చేస్తోంది.

శీతాకాలంలో చలికి ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు, ఆసుపత్రుల వద్ద రోగుల బంధువులు, యాచకులను చూసి మహతి రెడ్డి చలించిపోయింది. తను తయారు చేయించిన చాపలతో పాటు దుప్పట్లు కూడా వారికి పంపిణీ చేస్తోంది. తల్లిదండ్రుల సహకారంతో పర్యావరణ రక్షణ కోసం తనవంతు కృషి చేస్తున్నానని.. పేద ప్రజలకు సహాయం చేయడం తనకెంతో సంతోషంగా ఉందని మహతి రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తోంది.

"నా వ్యక్తిగత ప్రాజెక్టులో భాగంగా ప్లాస్టిక్‌ నుంచి చాపలను తయారుచేయాలని నిర్ణయించుకున్నాను. పర్యావరణంలో ప్లాస్టిక్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఏటా 35 కోట్ల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో పారేస్తున్నారు. చెత్త నిల్వ చేసే ప్రదేశాల్లో వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్ల గ్రీన్‌హౌస్ వాయువు ఉత్పత్తి అవుతోంది. దీనివల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు మా కాలనీలో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ సేకరించడం ప్రారంభించాను. అలాగే స్థానిక ప్రభుత్వ బడుల నుంచి కూడా సేకరిస్తున్నాను. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను శ్రీచక్ర పాలిప్లాస్ట్ కంపెనీకి తీసుకెళ్తాను. వాటిని పాలిప్రొపైలిన్ గ్రాన్యూల్స్‌గా వారు మారుస్తారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీవాళ్లు వాటితో చాపలు తయారు చేస్తూ మాకు సహాయపడుతున్నారు. ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ చాపలు పంపిణీ చేశాం. ప్లాస్టిక్ కూడా ఓ మంచి ఇన్సులేటర్ అయినందువల్లే నేను దీన్ని ఎంచుకున్నాను".-అలటి మహతి రెడ్డి, విద్యార్థిని

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details