చెడుపై మంచి సాధించిన విజయమే ఈ దీపావళి... ఆ విజయం కోసమే ఇళ్ల ముందర వెలుగుదివ్వెలొచ్చాయి... వెలుగుల కాంతులతో ఇల్లు.. ఇల్లాలి మోమున చిరునవ్వులు మెరుస్తున్నాయి. ఆ మెరుపులకు కొత్తబట్టలు కోటి కాంతులీనుతున్నాయి. దీపావళికి వర్గ విభేదాలుండవు. అమెరికాలో అయినా.. అమీర్‌పేటలో అయినా ఈ దివ్వెల సంబురం ఒకేలా ఉంటుంది.
మరి అలాంటి దీపావళి రోజున... ఆనందాన్ని ఏమాత్రం కోల్పోకాకుండా... సురక్షితంగా జరుపుకోవడమే మన లక్ష్యం కావాలి. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
చేయకూడని పనులు
- పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయొద్దు.
- అదిపైకి మండకపోయినా లోపల ఉండిపోతే దాన్ని చేతిలోకి తీసుకోగానే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.
- ముందు జాగ్రత్తగా అలాంటివాటిపై నీటిని చల్లి తడపండి.
- బాణాసంచా ఎప్పుడూ ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించొద్దు.
- బహిరంగ ప్రదేశాల్లోనే వాటిని పేల్చండి.
- జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం.
- గాజు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం.
చేయాల్సిన పనులు
- బాణాసంచాను పేల్చడానికి ముందు, ప్యాకింగ్‌లపై ఉండే సూచనలు చదవండి.
- మంటలు అంటుకునే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలి.
- భవనాలు, చెట్లు, ఎండుగడ్డి లాంటి చోట టపాసులు పేల్చడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.
- కాల్చిన బాణాసంచా సామగ్రిని ఇసుక పోసి ఓ ప్లాస్టిక్ బకెట్‌తో కప్పి ఉంచండి. దీనివల్ల ఆ దారిలో వేళ్లేవారికి హాని కలుగకుండా ఉంటుంది.
- టపాసులు కాల్చేసమయంలో ముందు జాగ్రత్తగా బక్కెట్‌తో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.
- బాణాసంచా కాల్చేటప్పుడు చేతులను టపాసుకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి.
- అలాగే టపాసుకు ముఖాన్ని దూరంగా ఉంచడం మర్చిపోవద్దు.