తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎప్పుడైనా.. ఎలాగైనా.. వీరితో ప్రమాదమే.. తస్మాత్‌ జాగ్రత్త! - women crime

ఎదురుగా ఉంటే పోరాడొచ్చు.. కనిపిస్తుంటే అప్రమత్తమవ్వొచ్చు.. వీళ్లు కనిపించరు... కానీ కాచుకుని ఉంటారు. ఎప్పుడైనా... ఎలాగైనా... వీరితో ప్రమాదం పొంచి ఉంది... తస్మాత్‌ జాగ్రత్త!

CYBER CRIME AGAINST WOMEN SPECIAL STORY
CYBER CRIME AGAINST WOMEN SPECIAL STORY

By

Published : Dec 5, 2019, 10:14 AM IST

‘మేడమ్‌ మా రెస్టరంట్‌లో చెక్‌ఇన్‌ అయినట్టుగా స్టేటస్‌ పెట్టండి.. పది శాతం రాయితీ ఇస్తాం! ’ అనగానే... ఓ దానికేం భాగ్యం అని పెట్టేస్తున్నారా?

ఊరూపేరూ తెలియని యాప్‌లు అడిగిన అన్ని ప్రశ్నలకీ యాక్సెస్‌ బటన్‌ నొక్కేస్తున్నారా?

షాపింగ్‌ చేసి మేడమ్‌ ఫోన్‌నంబర్‌ అని అడిగితే మరేం ఆలోచించకుండా టకాటకా చెప్పేస్తున్నారా?

కుటుంబ సభ్యులతో సెల్పీలు తీసుకుంటూ... లొకేషన్లని పంచుకుంటున్నారా?

అమ్మాయిలూ ఒక్కసారి ఆగండి.... ఇలా ఆలోచించండి


మనమెంతసేపూ కంటికి కనిపించే ప్రపంచంలోని భద్రత గురించే ఆలోచిస్తున్నాం. నాలుగు ఆత్మరక్షణ సూత్రాలు తెలిస్తే కాస్త ధైర్యంగా అడుగేయొచ్చులే అనుకుంటున్నాం. మరి కంటికి కనిపించని అదృశ్య శక్తుల మాటేంటి? మనమెక్కడున్నా వెంటాడి వేధిస్తున్న సైబర్‌ కీచకుల గురించి కాస్తయినా అప్రమత్తంగా ఉంటున్నారా..?

ఏమరుపాటు వద్ధు..

  • సైబర్‌ లేదా డిజిటల్‌ ప్రపంచంలో ఉన్న మనం ఏమరుపాటుతో, నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన సమాచారమే మనల్ని ఇబ్బందుల్లో పడేస్తోంది. అదే మన ప్రమేయం లేకపోయినా మనల్ని శారీరక, మానసిక హింసకు గురయ్యేట్లు చేస్తోంది. ఈ సంఘటన ఈ ఏడాదే జరిగింది. ఒక మహిళా విలేకరికి ఎదురైన సంఘటన ఇది. ఆగంతుకులు.. ఆమె పేరుతో పది ట్విటర్‌ ఖాతాలు తెరిచారు. ఫేక్‌ ప్రొఫైల్స్‌ తయారుచేసి.. అశ్లీల లింకులను ఆవిడ పేరుతో అందరికీ పంపారు. అది తెరవగానే అసభ్యకరమైన చిత్రాలు తెరుచుకునే ఏర్పాటు చేశారు. చివరికి ఆమె సైబర్‌ పోలీసుల సాయం తీసుకున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సదస్సులో తనకెదురైన చేదు అనుభవాలని పంచుకున్నారామె.
  • డిస్కౌంట్లతో ఆకట్టుకునే సంస్థలకు చెక్‌ఇన్‌ సమాచారం ఇవ్వకండి. ఇందులో మనకొచ్చిన నష్టమేముంది అనుకోకండి. మీ వ్యక్తిగత సమాచారం బయటివారికి సులభంగా తెలిసిపోతుంది. సైబర్‌ నేరగాళ్లకి ఇంతకు మించిన ఆయుధం ఉంటుందా? కానీ అమ్మాయిలు చేస్తున్న పొరపాటు ఇదే. మనంతట మనమే వ్యక్తిగత సమాచారం మోసగాళ్లకు చెబుతున్నాం.
  • అతను చాన్నాళ్లుగా తెలిసిన అబ్బాయే. ఓ రోజు ప్రపోజ్‌ చేశాడు. ఆ అమ్మాయి కాదంది. అతను నేరుగా ఏం చేయలేదు. పోర్న్‌సైట్‌లో అమ్మాయి ఫొటో పెట్టాడంతే. ఆమె అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులో జరిగిందీ సంఘటన.

సోషల్‌ ట్రోలింగ్‌

ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని బురద చల్లే ప్రయత్నాలు చేయడాన్నే సోషల్‌ ట్రోలింగ్‌ అంటారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే అవకాశాలు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కెమెరా హ్యాకింగ్‌

ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు వాడేవారు అవసరం ఉంటేనే వైఫై, ఇంటర్నెట్‌ను కనెక్ట్‌ చేసుకోవాలి. కొన్ని రకాల మాల్‌వేర్‌లను గ్యాడ్జెట్లలోకి పంపి మీకు తెలియకుండానే ఫొటోలు తీసుకోవచ్ఛు సెక్యూరిటీ లేని వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు వచ్చే అటాచ్‌మెంట్ల ద్వారా ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లకు మాల్‌వేర్‌ను చొప్పించి కెమెరా హ్యాక్‌ చేసే అవకాశం ఉంది. స్నానపు గదులకు ఫోన్లను దూరంగా ఉంచాలి.

  • ఒక్కసారి ఆన్‌లైన్‌లో పెట్టిన ఏ సమాచారమైన హ్యాక్‌ అవ్వడానికి ఆస్కారం ఉందని అమ్మాయిలు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేటప్పుడు మీ లొకేషన్‌ని షేర్‌ చెయ్యకండి.
  • ఫోన్‌ రీఛార్జ్‌ చేయించుకుంటున్నారా? తెలిసిన వ్యక్తే కదాని అతనికి మీ నంబరు ఇచ్చేయకండి. వీలైతే టాప్‌అప్‌ కార్డులు దొరుకుతాయి. అవి తీసుకోండి.
  • ఆఫర్లలో తక్కువ ధరకు వస్తున్నాయని ఏదో ఒక లింకులోకి వెళ్లి కొనుగోళ్లు చేయనేచేయొద్ధు గుర్తింపు పొందిన సంస్థల షాపింగ్‌ ప్లాట్‌ఫాంలలో వస్తువులు కొనేవారికి ఎలాంటి ఇబ్బందులూ రావు. కానీ తొంభైశాతం డిస్కౌంట్లు ఇస్తున్నామని ఫోన్‌కు వచ్చే ఫేక్‌ ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్‌, లింక్‌లను క్లిక్‌ చేసి వస్తువులు కొని మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వడం మాత్రం సరికాదు. అలాంటి సంస్థల డెలివరీ బాయ్స్‌ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.
  • ఇంటర్నెట్‌ కేఫ్‌లలో వ్యక్తిగత ఈ-మెయిళ్లు, ఫేస్‌బుక్‌, టెలిగ్రాం వంటి మాధ్యమాలను వినియోగించేవారు కచ్చితంగా లాగవుట్‌ అవ్వాల్సిందే. లేదంటే ప్రొఫైల్‌ హ్యాకింగ్‌ చేసి ఎవరైనా మీ వ్యక్తిగత, వృత్తిగత వివరాలను దుర్వినియోగం చేయొచ్చు.
  • వెబ్‌సైట్లలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు ఆ సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఉద్యోగ అవకాశాల పేరుతో వచ్చే మెయిల్స్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. సాధారణంగా వాటిల్లో మీ ఇంటి చిరునామాలు, ల్యాండ్‌మార్క్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈమెయిల్‌ ఇస్తే సరిపోతుంది.
  • సైబర్‌ నేరగాళ్లకి మీ సమాచారం తెలియకుండా ఉండాలంటే డబుల్‌ ఫోన్‌ చిట్కా పాటించండి: ఒక ఫోన్‌ నంబర్‌ పూర్తిగా మీ వ్యక్తిగతం. ఈ నంబర్‌కి వాట్సాప్‌ ఉండదు. ఫేస్‌బుక్‌లో ఇవ్వరు. పూర్తిగా మీకూ, మీ కుటుంబసభ్యులకు తెలిసిన నంబర్‌. ఏ అప్లికేషన్‌కి ఈ ఫోన్‌నంబర్‌కి సంబంధం ఉండదు. పూర్తిగా వ్యక్తిగతం. మరొకటి... సామాజిక సంబంధాల కోసం. జాబ్‌ అప్లికేషన్‌ వంటివాటికోసం వాడేది. రెజ్యుమేల్లో, ఈమెయిల్స్‌లో దీనిని ఉపయోగిస్తారు.
  • అందరికీ సృజనాత్మకత ఉంటుంది. అందుకే టిక్‌టాక్‌ వంటివాటికి అంత ప్రాముఖ్యం వచ్చింది. కానీ చిక్కంతా అభిమానులతోనే. మొదట్లో మేడమ్‌ మీ అభిమానిని అని మొదలుపెట్టిన మెసేజ్‌ల పరంపర ఎక్కడికైనా వెళ్లొచ్ఛు అందుకే ప్రైవసీ సెట్టింగ్స్‌పై పట్టుసాధించుకుని కావాల్సిన వారితోనే మీ వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

ABOUT THE AUTHOR

...view details