Bansilalpet step well: హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌డీఏ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రణాళికబద్ధంగా కార్యాచరణ చేపట్టిన సర్కార్.. జంటనగరాల్లో పురాతన మెట్ల బావుల మరమ్మతులకు నడుంబగించింది. నిజాం కాలంలో ప్రధాన రహదారులకు 100మీటర్ల దూరంలో నిర్మించిన ఈ బావులు.. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందకు పైగానే ఉన్నా.. అందులో చాలా వరకు కనుమరుగయ్యాయి.
కొన్ని బావుల స్థలాల్లో నిర్మాణాలు వెలియగా.. మరికొన్ని చోట్ల ఉన్న బావులు రూపును కోల్పోయి, చెత్తచెదారానికి ఆవాసాలుగా మారాయి. ఇలా దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తున్న మెట్లబావుల్లో ఒకటి.. బన్సీలాల్‌పేట్‌లో 3శతాబ్దాల క్రితం నిర్మించిన నాగన్నకుంట నీటివనరు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో అబ్బురపరిచే నిర్మాణశైలితో ఈ కట్టడం నిర్మితమైంది. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన ఈ మెట్లబావిని పునరుద్ధరించేందుకు సర్కార్ నడుంబిగించింది.
సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఏంసీ మెట్లబావి పూర్వ వైభవానికి చర్యలు చేపట్టింది. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8 నెలల పాటు శ్రమించి.. రూపురేఖలు మార్చివేశారు. బావుల వద్ద ఆక్రమణల తొలగింపు, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు.