తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా భయంతో.. దీర్ఘకాలిక వ్యాధుల్ని పట్టించుకోవడం లేదు' - డాక్టర్‌ పళనివేలు ఇంటర్వ్యూ

Dr. Palanivelu Interview: కొవిడ్‌ సోకకుండా జాగ్రత్తపడే క్రమంలో... దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సంబంధిత వైద్యులను సంప్రదించేందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, బీసీ రాయ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ పళనివేలు అన్నారు. కొందరు రోగులు సొంత వైద్యాన్ని కొనసాగిస్తూ... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని గుర్తుచేశారు. కొవిడ్‌ తొలి, మలి విడతల్లో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సొంత వైద్యంతో ఆరోగ్యాలను మరింత పాడుచేసుకున్నారని విచారం వెలిబుచ్చారు.

Dr. Palanivelu Interview
డాక్టర్‌ పళనివేలు ఇంటర్వ్యూ

By

Published : Jan 7, 2022, 9:38 AM IST

Dr. Palanivelu Interview: కరోనా భయంతో జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధుల గురించి పట్టించుకోకపోవడం వల్ల ప్రాణాంతక పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రముఖ సర్జికల్‌గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు బీసీ రాయ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ పళనివేలు ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ తొలి, మలి విడతల్లో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సొంత వైద్యంతో ఆరోగ్యాలను మరింత పాడుచేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వీరు కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే.. దీర్ఘవ్యాధుల విషయంలో వైద్యుల సలహాలు పాటిస్తూ చికిత్స కొనసాగించాలని సూచించారు. ల్యాప్రోస్కోపీ విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వైద్యుడిగా పళనివేలుకు ఎంతో పేరుంది. విజయవాడలో గురువారం ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ‘ఈటీవీ భారత్​’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

డాక్టర్‌ పళనివేలు ఇంటర్వ్యూ

ఎవరికి వారే రక్షణ పొందొచ్చు

వైరస్‌ పుట్టినంత సులువుగా కనుమరుగవదు. ఉత్పరివర్తనం చెందుతూ మనుగడ సాగిస్తుంది. కొవిడ్‌ వరకు చూస్తే.. రోగనిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రతను కొనసాగిస్తే ఉత్పర్తివర్తనాల తీవ్రత గురించి కంగారుపడాల్సిన అవసరం ఉండదు. మాస్కు ధరించాక తరచూ దాన్ని చేతులతో తాకుతూ ఉంటే ఉపయోగం లేదనే విషయాన్ని గుర్తించాలి. బూస్టర్‌ డోసు ఇవ్వడం, తీసుకోవడం మరింత మంచిది.

కొవిడ్‌ వేళ క్యాన్సర్లు ముదిరాయి

కొవిడ్‌ సోకకుండా జాగ్రత్తపడే క్రమంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సంబంధిత వైద్యులను సంప్రదించేందుకు వెనుకంజ వేస్తున్నారు. కొందరు రోగులు సొంత వైద్యాన్ని కొనసాగిస్తే.. మరికొందరు మందులు వాడటమే మానేశారు. ఈ క్రమంలో చిన్నచిన్న జబ్బులు పెద్దవయ్యాయి. సాధారణ మందులతో నయమయ్యే వ్యాధులకూ శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ బాధితుల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలున్న క్లోమగ్రంథి, పేగు, కాలేయం, ఇతర క్యాన్సర్ల వ్యాధిగ్రస్తులు జబ్బు ముదిరాక ఆసుపత్రులకు వస్తున్నారు. వీరికి చికిత్స చేయడమూ క్లిష్టంగా మారుతోంది. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు కూడా సకాలంలో వైద్యసేవలు పొందక అనారోగ్యాలపాలయ్యారు.

ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిందే

ఈ రెండేళ్లలో ఊబకాయులైన పిల్లల శాతం పెరిగింది. శీతలపానీయాలు, అధికంగా పిండి పదార్ధాలున్న ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ ఆహార అలవాట్ల వల్ల దెబ్బతిన్న ఆరోగ్యం వైరస్‌ల ధాటికి మరింత క్షీణిస్తోంది.

ఇదీ చదవండి:Constipation Problem: కడుపుబ్బరమా? అయితే.. తగ్గించుకోండిలా..!

ABOUT THE AUTHOR

...view details