పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, దేశమంతా పర్యటించి బీసీల్ని భాజపాకు చేరువచేయడమే లక్ష్యంగా పనిచేస్తానని భాజపా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. వారి మద్దతు కూడగట్టి 2023లో తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడం కోసం ఇతర ముఖ్యనేతలతో కలిసి పనిచేస్తానన్నారు. ‘ఈటీవీ భారత్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
- కేంద్ర ప్రభుత్వంలో ప్రధానికి తప్ప బీసీ నేతలకు పెద్దగా ప్రాధాన్యం లేదన్న విమర్శలపై మీరెలా స్పందిస్తారు?
మోదీ పేదరికం అనుభవించారు. బీసీల సమస్యలు తెలిసిన వ్యక్తి. ఆయనే ప్రధానిగా ఉన్నారు. సంతోష్ గంగ్వార్ వంటి మంత్రులున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు దళారులు లేకుండా నేరుగా పేదలకు అందుతున్నాయి. పేదల్లో ఎక్కువమంది బీసీలే కదా? ఓబీసీ కమిషన్ ఇచ్చే నివేదిక అధ్యయనం చేసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేలా నా వంతు పాత్ర పోషిస్తా. తెలంగాణలో 54 శాతం జనాభా వెనుకబడిన వర్గాల వారే. వారిని భాజపాకు మద్దతుగా మలచడానికి ప్రయత్నిస్తా. ముస్లింలను కలపడం వల్ల బీసీలకు నష్టం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం బీసీల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ కేటగిరీలో మజ్లిస్ నేతలు స్థానిక సంస్థల్లో పదవుల్ని పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో 50 డివిజన్లలో బీసీలకు రిజర్వేషన్ ఉంటే 32 మందే ఎన్నికయ్యారు. 18 చోట్ల ముస్లింలు బీసీ కోటాలో గెలిచారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నారు. బీసీలకు మాత్రం 10,000 లోపు ర్యాంకు.. అంటూ ఆంక్షలు పెడుతున్నారు.
- కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతుల్లో బీసీలే ఎక్కువ ఉంటారు.. దీనిపై ఏమంటారు?
తెరాస, కాంగ్రెస్.. దళారులకు కొమ్ముకాస్తున్నాయి. పేదలకు మేలు చేయడానికే కేంద్రం కొత్త చట్టం తెచ్చింది. కేసీఆర్, రాష్ట్ర మంత్రులు వ్యవసాయ చట్టంపై రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మార్కెట్ కమిటీలపై తమ ఆధిపత్యం పోతుందన్నది తెరాస భయం. రైతు ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తుంటే వారికి అభ్యతరం ఏంటి? ఉదాహరణకు.. గుంటూరు మిర్చి.. ప్రస్తుతం అక్కడే అమ్మాలి. కొత్త బిల్లుతో ధర ఎక్కడ ఎక్కువుంటే అక్కడ అమ్మవచ్చు. పాతవిధానంలో దళారులు తక్కువకు కొని లాభాల్ని గడిస్తున్నారు. దళారీ వ్యవస్థని రూపుమాపే ప్రయత్నాన్ని తెరాస అడ్డుకుంటోంది.
- తెలంగాణలో వెనుకబడిన వర్గాల వారు ఎక్కువ. కానీ ఇక్కడ నాయకత్వం ఎదగకపోవడానికి కారణాలు ఏంటి?
తెలంగాణలో కులాల పేరిట ఏకం అవుతున్నారు. కానీ బీసీలం అన్న భావన పెరగడం లేదు. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడటం వల్ల కూడా.. రాజకీయాల్లో రాణించకపోతున్నారు. గతంలో ఎన్టీఆర్ తెదేపా పెట్టి.. వారిలో చైతన్యం తెచ్చారు. దాంతో వారంతా తెదేపాకు అండగా నిలిచారు. తెరాస బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుండటంతో వారిప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారిని ఏకం చేస్తాం.
- జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు వచ్చాయి. తెలంగాణలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు?