International Mother Language Day 2023: మనకి ఎన్ని భాషలు వచ్చినా ఆ భాషలన్నింటికి మూలం మాతృభాషే. చిన్నప్పుడు పలికే తొలి పలుకు మాతృభాషలోనిదే. మనం ఎదుటి వ్యక్తి భావాలు అర్థం చేసుకోవాలన్నా.. మన మనసులో ఉన్న విషయాలు ఎదుటి వ్యక్తులతో వ్యక్తపరచాలన్న దానికి భాష చాలా ముఖ్యం. నా మాతృ భాష తెలుగు. చిన్నప్పటి నుంచి నేను తెలుగులోనే చదువుకున్నా.. తెలుగే రాశాను. కానీ రానురాను ఆ తెలుగు అంతరించిపోతోందన్న బాధ నన్ను నిత్యం వెంటాడుతోంది. తెలుగుతో నా బంధం ఈనాటిది కాదు.
హాలో నేను గుర్తుకువచ్చానా.. అదేనండి చిన్నప్పుడు నాతో చాలా బాగా స్నేహం చేశారుగా.. మీరు చిన్నతనంలో చేసిన ప్రతి అల్లరిలోను నేను ఉన్నాను. అమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలని ఆడిన ముద్దు ముద్దు పలుకులు, నాన్న దగ్గర భయాన్ని నటిస్తూ చిన్న చిన్న అబద్దాలు, స్నేహితులతో ఆడే దాగుడుమూతల్లోనూ.. ఇలా ప్రతిసారి నేను మీతో ఎంతో ఆనందంగా జీవిస్తూ గడిపాను. నాలో ప్రతి అక్షరం మీ అభివృద్ధికి ఎంతో సహకరించింది. అలానే నన్ను మీరు అభివృద్ధి చేయకపోయిన పర్వాలేదు. నాశనం చేయకుండా ఉంటే చాలు. మన రాజ్యంగంలో సంస్కృతిని కాపాడుతూ.. వచ్చే తరాలకు అందించాలని ఉంది.
ఇప్పటికే నాలో ఉన్న చాలా సమాచారం మెల్ల మెల్లగా కనుమరుగు అవుతుంది. ఎవరో కొంత మంది భాషా పండితులకు మాత్రమే గుర్తుకున్నాయేమో..! నా సంపద అయిన కథలు, నవలు, సామెతలు, జాతీయాలు, కథానికలు, వ్యాసాలు, పద్యాలు, కవితలు... ఇలాంటి ఎన్నో వాటితో మీకు నైపుణ్యాన్ని, మనిషికి కావాల్సిన కనీస జ్ఞానాన్ని అందించాను. ఇప్పుడు నిజం చెప్పండి ఎవరైనా వాటిని చదువుతున్నారా.. అసలు అవి ఎలా ఉంటాయో తెలుసా.? చూశారా అని ఆలోచిస్తున్నాను. మీరే వాటిని ఆలోచించి గుర్తుకు తెచ్చుకుంటే భవిష్యత్తు తరాల వాళ్లకి అవి ఉన్నాయనే తెలియదు. అలాంటప్పుడు నాలో ఉన్న మధురమైన అనుభూతులు, జ్ఞానం ఎలా తెలుస్తుంది. తల్లి ప్రేమలో ఉండే మాధుర్యం గుర్తించాలంటే కనీసం నేను మీకు పరిచయం అయినా ఉండాలి.
చిన్న చిన్న అడుగులు వెసుకుంటూ ఎలా అయితే మొదట నడవడం మొదలు పెడతారో అలానే మీరు ఉన్నత శిఖరాలకు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఆపై నున్న మీకు నేను కనిపించడం లేదు. నన్ను మరిచిపోయే స్టేజ్‌కి వచ్చారు. ఏది ఏమైనా నేను ఎల్లప్పుడు మీ మంచిని, ఆనందాన్ని, ఎదుగుదలనే కోరుకుంటాను. ఏది ఏమయినా మీ అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.
ఇవీ చదవండి: